West Bengal Train Accident Causes : సిగ్నల్ జంప్ కారణంగానే బంగాల్లో కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టిందని రైల్వే బోర్డ్ అధికారులు తెలిపారు. రెడ్ సిగ్నల్ వేసినా గూడ్స్ రైలు పట్టించుకోకుండా వెళ్లడం వల్లే ఈ ఘటన జరిగిందని రైల్వే బోర్డ్ సీఈఓ జయ వర్మ సిన్హా పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో 15మంది మరణించారని, 60మందికి పైగా గాయపడ్డారని మొదట వార్తలు వచ్చాయి. కానీ ఈ ఘటనలో మొత్తం 9మంది మృతిచెందారని, 41మంది గాయపడ్డారని రైల్వేశాఖ తాజాగా వివరాలు వెల్లడించింది.
"ఈ ప్రమాదం సోమవారం ఉదయం 8:55 గంటలకు జరిగింది. కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి ఓ గూడ్స్ రైలు వచ్చి ఢీ కొట్టింది. రెడ్ సిగ్నల్ వేసినా గూడ్స్ ట్రైన్ లోకోఫైలట్ పట్టించుకోకుండా ముందుకు వెళ్లిన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనలో గూడ్స్ రైలు లోకోపైలట్, అసిస్టెంట్ లోకోపైలట్, కాంచన్‌జంఘా ఎక్స్ ప్రెస్ గార్డు మృతి చెందారు. అసోం- సీల్దా మార్గంలోని అన్ని రైల్వే స్టేషన్లలో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశాం" అని జయ వర్మ సిన్హా వెల్లడించారు.
ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన కేంద్రం
ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 ఆర్థిక సాయం ఇస్తున్నట్లు తెలిపారు. మరోవైపు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా బాధితులకు పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.2.5 లక్షలు చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు.
'రైల్వే మంత్రి రాజీనామా చేయాలి'
రైల్వే శాఖ సరైన నిర్వహణ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ తివారీ అన్నారు. 'రైలు ప్రమాదాలు సరైన నిర్వహణ లేకపోవడం వల్లే జరగుతున్నాయి. ట్రాక్‌లపై భారం పెరుగుతోంది. కానీ భద్రత చర్యలు సరిగా చేపట్టం లేదు. ఇప్పటికే ఒడిశా రైలు ప్రమాదం నుంచి దేశం కోలుకోలేదు. ఈ లోపే మరో రైలు ప్రమాదం జరిగింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగింది. రైల్వే మంత్రి రాజీనామా చేయాలి' అని ప్రమోద్ తివారీ అన్నారు.
అంతా క్షణాల్లో జరిగిపోయింది!
రైలు ప్రమాదం సమయంలో ఏం జరిగిందో తెలియలేదని ప్రయాణికులు చెబుతున్నారు. 'నేను బీ1 కోచ్‌లో ఉన్నా. సడెన్ ట్రైన్ ప్రమాదానికి గురైంది. నాకు తలపై గాయమైంది. కిందకు దిగి చూసినప్పుడు గూడ్స్ ట్రైన్ వెనుక ఢీకొట్టి ఉంది' అని ఓ ప్రయాణికుడు తెలిపాడు.
మరోవైపు కాంచన్‌జంఘా ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు 10 బస్సులు ఏర్పాటు చేసినట్లు బంగాల్ ఆర్టీసీ ఛైర్మన్ తెలిపారు. ఈ బస్సులు ఘటన స్థలానికి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. సిలిగుడి - కోల్‌కతా వెళ్లడానికి మధ్యాహ్నం నుంచి అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ మధ్య కాలంలో రైలు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఒకే పట్టాలపై రెండు రైళ్లు రావడం, సిగ్నల్స్‌లో సమస్య తలెత్తడం, సిగ్నల్ జంప్ తదితర కారణాల వల్ల రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.