Slum Children Cleared UP Board Exam : దేశ భవితకు పట్టుకొమ్మలైన బాలబాలికలు ఈనాటికీ విద్యకు దూరమవుతున్నారు. విద్యకు నోచుకోక బాల కార్మికులుగా మురికివాడల్లో జీవితం వెల్లదీస్తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని పథకాలు రూపొందిస్తున్నా, అమలులో చిత్తశుద్ధి కరవై అమాయకుల బతుకులు ఇంకా పేదరికంలోనే మగ్గుతున్నాయి. అయితే అలాంటి వారికి కాస్త ప్రోత్సాహం ఇచ్చి, విద్య అందిస్తే భావి భారత పౌరులుగా ఎదుగుతారని ఈ ఘటన రుజువు చేసింది. ఉత్తర్ప్రదేశ్ అగ్రాలోని మురికివాడల్లో నివసించే కొందరు బాలబాలికలు యూపీ బోర్డు పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. అక్కడి బాలల హక్కుల, సామాజిక కార్యకర్తలు వెన్నుతట్టి విద్యార్థులను ప్రోత్సహించారు.
'చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు'
అగ్రాలోని పంచకూయియాలో విద్యాశాఖ కార్యాలయం ఉంది. ఆ ప్రాంతంలో ఉండే కొందరు బాలబాలికలు విద్యకు నోచుకోక, మురికివాడల్లో నివసిస్తున్నారు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ, యాచకులుగా జీవనం గడుపుతున్నారు. వీరి దుర్బర స్థితి చూసిన నరేశ్ పరాస్ అనే సామాజిక కార్యకర్త చలించిపోయారు. ఆ మురికివాడ పిల్లల చదువు గురించి వారి తల్లిదండ్రులతో మాట్లాడారు. చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని వారికి అర్థమయ్యేలా వివరించారు. అలా మురికివాడ పిల్లలు చదువుకునేలా నరేశ్ ప్రోత్సహించారు. నరేశ్ ప్రోత్సాహంతో షేర్ అలీ ఖాన్ అనే బాలుడు 12వ తరగతి, మరో ముగ్గురు బాలికలు 10వ తరగతి బోర్డు పరీక్షలకు హాజరయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఈ బాలబాలికలు మంచి ప్రతిభ కనబర్చారు. షేర్ అలీ ఖాన్ 66శాతం మార్కులు సాధించగా, ముగ్గురు బాలికలు పదో తరగతిలో పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు.
తాను బోర్డు పరీక్ష పాసవ్వడంపై షేర్ అలీ ఖాన్ స్పందించాడు. ఆర్మీ సైనికుడిగా దేశానికి సేవచేయడమే తన గోల్ అని తెలిపాడు. ఇక మరో బాలిక కరీనా, డాక్టర్ అయి పేదలకు సేవ చేయడమే తన లక్ష్యం అని చెప్పింది. మరో ఇద్దరు అమ్మాయిలు నిర్జల, కామిని తాము పోలీస్, టీచర్ కావాలనుకుంటున్నట్లు తెలిపారు.
వీరితో పాటు వాజిపుర్ నివాసి అయిన సానియా కూడా 12వ తరగతి పరీక్షల్లో ఫస్ట్ డివిజన్లో ఉత్తీర్ణురాలైంది. ఆర్థిక స్తోమత లేక చదువు మధ్యలోనే మానేసి పూలు అమ్మడం మొదలు పెట్టింది సానియా. ఇది గమనించిన నరేశ్ పరాస్, సానియా తల్లిదండ్రులతో మాట్లాడి సేయింట్ జాన్స్ ఇంటర్ కాలేజీలో ఆమెకు తిరిగి అడ్మిషన్ ఇప్పించారు. అనంతరం బోర్డు పరీక్షలకు సిద్ధమైంది సానియా. భవిష్యత్లో లాయర్ కావడమే తన డ్రీమ్ అని చెబుతోంది.
బాల్య వివాహం నుంచి తప్పించుకుని
ఇదే కాకుండా చాలా మంది బాలికలను బాల్య వివాహాల నుంచి రక్షించారు నరేశ్. గతంలో, తల్లిదండ్రులు చనిపోయిన ఇద్దరు బాలికలకు బాల్యవివాహం చేయాలని రాజస్థాన్లోని ఓ వ్యక్తికి విక్రయించేందుకు వారి బంధువులు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న నరేశ్, ప్రభుత్వాధికారుల సహాయంతో వారిని రక్షించారు. అనంతరం వారు చదువుకునేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వారిద్దరు 12వ తరగతి పరీక్షల్లో పాసయ్యారు.
పెళ్లికి వెళ్లి వస్తుండగా ప్రమాదం- ట్రాలీ ఢీకొని 9మంది మృతి - Road Accident In Rajasthan