Maharashtra Election 2024 Worli : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటం వల్ల అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. గెలుపుపై అటు మహాయుతి, ఇటు మహా వికాస్ అఘాడీ కూటములు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వాలతో ఎన్నికల వేడిని పెంచాయి. అయితే ముంబయిలోని వర్లీ నియోజకవర్గంపై ప్రస్తుతం అందరీ దృష్టి నెలకొంది. ఎందుకంటే అక్కడ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తనయుడు ఆదిత్య ఠాక్రే శివసేన (యూబీటీ) తరఫున పోటీ చేస్తున్నారు. ఆయనపై మిలింద్ దేవరాను ఏక్నాథ్ శిందే బరిలోకి దింపారు. దీంతో వర్లీలో సేన వర్సెస్ సేన మధ్య పోటీ నెలకొంది.
వర్లీలో సేన vs సేన
ముంబయి సౌత్ లోక్ సభ పరిధిలో వర్లీ నియోజకవర్గం ఉంది. అక్కడ శివసేన రాజ్యసభ ఎంపీ మిలింద్ దేవరా కుటుంబానికి మంచి పట్టుంది. మిలింద్ తండ్రి మురళీ దేవరా 1984, 1989,1991, 1998 లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా గెలుపొందారు. అలాగే మిలింద్ దేవరా సైతం కాంగ్రెస్ తరఫున 2004, 2009లో వరుసగా రెండు పర్యాయాలు ఎంపీగా విజయం సాధించారు. కొన్నాళ్ల క్రితం శివసేనలో చేరిన మిలింద్ దేవరా, ఇటీవలే రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2024 సార్వత్రిక పోరులో మిలింద్ బరిలోకి దిగుతారని అందరూ భావించినా, ఆయన పోటీ చేయలేదు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిత్య ఠాక్రేపై వర్లీ నుంచి బరిలోకి దిగారు. దీంతో వర్లీ నియోజకవర్గంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఆదిత్య ఠాక్రేకే ప్రజల మొగ్గు!
ముంబయి సౌత్‌లో 2024 లోక్‌సభ ఎన్నికల్లో శివసేన యూబీటీ నేత అరవింద్ సావంత్ జయకేతనం ఎగురవేశారు. అయితే 2019 కంటే మెజారిటీ మాత్రం తగ్గింది. కాగా, వర్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో శివసేన యూబీటీకి కేవలం 7వేల ఓట్లు మాత్రమే ఎక్కువగా వచ్చాయి. దీంతో ఈ సారి శివసేన, శివసేన(యూబీటీ) మధ్య గట్టి పోటీ ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆదిత్య ఠాక్రే గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. అయితే మిలింద్ దేవరా వంటి బలమైన అభ్యర్థి బరిలోకి దిగడం వల్ల ఎదైనా జరగొచ్చని అంటున్నారు.
ఎంఎన్ఎస్ పోటీ
కాగా, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వర్లీ నియోజకవర్గంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన పోటీ చేయలేదు. ఆదిత్య ఠాక్రే ఎన్నికల అరంగేట్రాన్ని గౌరవించేందుకు ఎంఎన్ఎన్ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే తాజా ఎన్నికల్లో మాత్రం తమ అభ్యర్థిని బరిలోకి దింపింది. సందీప్ దేశ్ పాండేను ఆదిత్య ఠాక్రేపై పోటీకి ఉంచింది. 2017లో వర్లీ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీకి 30వేలకుపైగా ఓట్లు వచ్చాయని, తమ పార్టీకి మద్దతుగా చాలా మంది ఓటర్లు ఉన్నారని సందీప్ దేశ్ పాండే తెలిపారు.
'ప్రజలకు తెలుసు'
కాగా, శివసేన యూబీటీ అభ్యర్థి ఆదిత్య ఠాక్రే గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ఒక బూటకపు వాగ్దానాల పార్టీ అని ప్రజలు గ్రహించారని విమర్శించారు. ఏక్నాథ్ శిందేకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పును ఇస్తారని పేర్కొన్నారు. వర్లీ ప్రజలు తన ఆశీర్వదీస్తారని ధీమా వ్యక్తం చేశారు.
వర్లీలో ఎక్కువగా సంపన్నులు ఉన్న నియోజకవర్గం. అలాగే వ్యాపార లావాదేవీలు కూడా ఎక్కువగా జరుగుతాయి. అనేక మురికివాడల పునరావాస ప్రాజెక్టులు ఈ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉండిపోయాయి. కాగా, ఈ నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే శివసేన యూబీటీ నేత ఆదిత్య ఠాక్రే ఉన్నారు. ఈయన 2019లో 65వేలకుపైగా ఓట్ల తేడాతో ఎన్సీపీ అభ్యర్థిపై గెలుపొందారు.
నవంబరు 20న పోలింగ్
కాగా, మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు నవంబర్ 20న ఒకే దశలో పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.