PM Kisan Money Increase : పీఎం-కిసాన్ పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇచ్చే నిధుల మొత్తాన్ని పెంచుతారని చాలా కాలం నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన ప్రకటన చేస్తుందని అంతా భావించారు. కానీ మధ్యంతర బడ్జెట్లో దాని గురించిన ప్రస్తావనేదీ లేదు. నిధుల మొత్తం పెంపుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఈ విషయంపై పార్లమెంట్ వేదికగా కేంద్రం తాజాగా స్పష్టత ఇచ్చింది. పీఎం కిసాన్ నిధులు పెంచే ఆలోచన లేదని స్పష్టం చేసింది.
కేంద్ర వ్యవసాయ మంత్రి సమాధానం ఇదే
లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి అర్జున్ ముండా ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఏడాదికి రూ.6వేలు ఇస్తుండగా ఆ మొత్తాన్ని రూ.8వేలకో, రూ.12 వేలకో పెంచే ఉద్దేశం లేదని తెలిపారు. మహిళా రైతులకు సాయం పెంచే ప్రతిపాదన సైతం తమ వద్ద లేదని స్పష్టం చేశారు.
కిసాన్ సమ్మాన్ నిధి- అర్హులకు ఏడాదికి రూ.6 వేలు
2019లో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం- కిసాన్) యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6వేలు అందిస్తోంది. ప్రతి నాలుగు నెలలకు ఓసారి రూ.2వేల చొప్పున మూడు విడతల్లో నిధులు విడుదల చేస్తోంది. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నిధులు జమ చేస్తోంది.
ఏపీ, తెలంగాణలో లబ్ధిదారులు ఎంత మందంటే?
ఈ పథకం కింద ఇప్పటివరకు 11 కోట్ల మంది రైతులకు 15 విడతలుగా సాయం అందించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. లబ్ధిదారులకు మొత్తం రూ.2.81 లక్షల కోట్లు చెల్లించినట్లు చెప్పారు. పీఎం- కిసాన్ నిధులు అందుకున్న రైతుల్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 2.62 కోట్ల మంది ఉన్నారని వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఏపీ నుంచి 43 లక్షలు, తెలంగాణ నుంచి 30 లక్షల మంది లబ్ధి పొందుతున్నారు.