Jammu Kashmir Assembly Election 2024 : జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, కాంగ్రెస్ మధ్య ఇప్పటికే పొత్తు ఖరారైంది. తాజాగా రెండు పార్టీలూ సీట్ల సర్దుబాటుపై ఓ నిర్ణయానికి వచ్చాయి. తొలి విడత ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనున్న నేపథ్యంలో ఇరు పార్టీలు ఓ నిర్ణయం తీసుకున్నాయి.
ఐదు స్థానాల్లో ఫ్రెండ్లీ కాంపిటేషన్!
జమ్మూకశ్మీర్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా ఒప్పందం ప్రకారం 32 చోట్ల కాంగ్రెస్, 51 స్థానాల్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ యూనిట్ కాంగ్రెస్ చీఫ్ తారిఖ్ హమీద్ కర్రా మీడియాకు వెల్లడించారు. ఐదు స్థానాల్లో కాంగ్రెస్, ఎన్‌సీల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని తెలిపారు. మిగితా రెండు స్థానాల్లో సీపీఎం, జేకేఎన్‌పీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు.
ఒప్పందానికి కట్టుబడి
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ సిద్ధమవుతోంది. ఈ క్రమంలోనే సీట్ల పంపకాలపై ఇరు పార్టీల మధ్య చర్చల వేళ విభేదాలు తలెత్తినట్లు ప్రచారం జరిగింది. దీన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ ఇద్దరు సీనియర్ నేతలు కేసీ వేణుగోపాల్, సల్మాన్ ఖుర్షీద్‌లను ట్రబుల్ షూటర్స్‌గా శ్రీనగర్‌కు పంపగా ఆ చర్చల ఫలితంగా సీట్ల పంపకాలపై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, ఎన్‌సీ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాయని హమీద్ పేర్కొన్నారు. తాజాగా సీట్ల సర్దుబాటుపై సమావేశంలో చర్చించిన అంశాలు ఆయన వెల్లడించారు.
90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో!
జమ్ముకశ్మీర్‌లో చివరగా 2014లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ప్రభుత్వ ఏర్పాటుకు పీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. 2019లో కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసింది. జమ్మూకశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలు (జమ్ముకశ్మీర్, లద్దాఖ్)గా విభజించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో (సెప్టెంబరు 18న తొలి విడత, సెప్టెంబరు 25న రెండో విడత, అక్టోబరు 1న మూడో విడత) పోలింగ్ నిర్వహించనున్నారు. అక్టోబరు 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.