Mysore Dasara Jamboo Savari 2024 : కర్ణాటకలోని మైసూరు రాజకోటలో అంగరంగ వైభవంగా జరిగిన దసరా ఉత్సవాలు జంబూ సవారీతో మంగళవారం ముగిశాయి. గజరాజు మీద స్వర్ణ అంబారీ ఉంచి అందులో చాముండేశ్వరీ దేవి విగ్రహాన్ని ఊరేగించారు. స్వర్ణ అంబారీ కట్టిన ఏనుగుతోపాటు మొత్తం మరిన్ని గజరాజులు కూడా వేడుకల్లో పాల్గొన్నాయి. శనివారం సాయంత్రం సీఎం సిద్ధరామయ్య ప్రముఖులతో కలిసి జంబూ సవారీని పూలజల్లుతో ప్రారంభించారు.
వందల ఏళ్లుగా ప్రతి సంవత్సరం జరిగే ఈ అపూర్వ ఘట్టాన్ని తిలకించేందుకు మైసూరు రాజవంశస్థులు, రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మంత్రులు హాజరయ్యారు. భక్తులు, సందర్శకులు భారీగా మైసూరుకు తరలివచ్చారు. చాముండేశ్వరి దేవిని తీసుకొస్తున్న సమయంలో ప్యాలెస్‌లోని వీధుల్లో కళా ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. కర్ణాటకలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు, సంగీత వాయుద్య బృందాలు, వారసత్వం, సంస్కృతి ఉట్టిపడే వేషదారణ ధరించిన కళాకారులు అమ్మవారి ఊరేగింపు వేడుకలో దారిపొడవునా వారి కళలను ప్రదర్శించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రతిబింబించే శకటాలను వేడుకల్లో ప్రదర్శించారు.
పటిష్ఠ భద్రతా చర్యలు
జంబూ సవారీ జరిగిన మార్గంలో పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. కొన్ని వేల మందికి పోలీసులను మోహరించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహా మరిన్ని భద్రతా ఏర్పాట్లు చేశారు. ఊరేగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. ఏనుగుల సవారీ మార్గం వెంబడి నిఘా కెమెరాల్ని ఏర్పాటుచేశారు.
పూర్వపు రోజుల్లో ఏనుగు అంబారీపై రాజు తన సోదరుడు లేదా మేనల్లుడితో కలిసి కూర్చునేవారు. కొంతకాలానికి రాజులకు బదులు మైసూర్ నగర ప్రధాన దేవత చాముండేశ్వరీ దేవి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకువెళ్లడం ప్రారంభించారు. శ్రీ జయచామ రాజేంద్ర వడయార్ చివరిగా బంగారు అంబారీలో కూర్చోని ఊరేగింపులో పాల్గొన్నారు. అమ్మవారిని ఊరేగించే అంబారీని చెక్కతో తయారు చేస్తారు. అనంతరం 80 కిలోల బంగారంతో ఆ మండపానికి తాపడం చేస్తారు. మైసూర్ దసరా ఉత్సవాలను 1610లో మొదటి వడయార్ రాజు ప్రారంభించారు. అనంతరం 1970 వ దశకంలో మైసూర్ దసరా ఉత్సవాల నిర్వహణకు కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ అప్పటి ముఖ్యమంత్రి దేవరాజ్ ఉర్స్ చొరవతో దసరా ఉత్సవాలు గత వైభవాన్ని సంతరించుకున్నాయి.