LS Speaker contest Om Birla VS K Suresh : లోక్‌సభ చరిత్రలో అత్యంత అరుదుగా జరిగే స్పీకర్ ఎన్నిక కోసం బుధవారం(జూన్ 26) దిగువ సభ సమావేశం కానుంది. లోక్‌సభ స్పీకర్ పదవి కోసం అధికార నేషనల్ డెమొక్రటిక్ అలయన్స్(ఎన్‌డీఏ) కూటమి తరఫున బీజేపీ ఎంపీ ఓం బిర్లా, ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున కాంగ్రెస్ ఎంపీ కొడికున్నిల్ సురేశ్ మంగళవారం నామినేషన్లు దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్ పదవిని తమకు వదిలేయాలని విపక్ష ఇండియా కూటమి డిమాండ్ చేసింది. అయితే దీనికి అధికార ఎన్‌డీఏ కూటమి నిరాకరించింది. దీంతో స్పీకర్ పదవికి ఇండియా కూటమి తమ అభ్యర్థిని నిలిపింది. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ పదవికి పోటీ చేస్తున్న ఓం బిర్లా, కొడికున్నిల్ సురేశ్ రాజకీయ ప్రస్థానాన్ని ఓసారి చూద్దాం.
100మంది ఎంపీలను సస్పెండ్ చేసిన ఓం బిర్లా!
- 61ఏళ్ల ఓం బిర్లా వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్ పదవికి పోటీ చేస్తున్నారు.
- ఈసారి కూడా ఓం బిర్లాకు స్పీకర్‌గా అవకాశం దక్కితే, రెండు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత స్పీకర్ పదవిని వరుసగా రెండోసారి పొందిన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టిస్తారు.
- డిప్యూటీ స్పీకర్ నియామకం లేకుండా పూర్తి కాలం పాటు పనిచేసిన మొదటి స్పీకర్ కూడా ఓం బిర్లాయే.
- అంతకుముందు 12, 13వ లోక్‌సభల్లో వరుసగా రెండు పర్యాయాలు స్పీకర్ పదవికి ప్రఖ్యాత తెలుగు పార్లమెంటేరియన్, దివంగత జీఎంసీ బాలయోగి ఎంపికయ్యారు.
- రాజస్థాన్‌లోని కోటా లోక్‌సభ స్థానం నుంచి మూడోసారి ఎంపీగా ఓం బిర్లా ఎన్నికయ్యారు.
- రాజస్థాన్ అసెంబ్లీకి మూడుసార్లు ఎమ్మెల్యేగానూ ఓంబిర్లా ఎన్నికయ్యారు.
- భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం)లో వివిధ పదవులను ఓంబిర్లా చేపట్టారు.
- 1991 నుంచి 2003 వరకు బీజేవైఎం రాజస్థాన్ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఆ తర్వాత జాతీయ ఉపాధ్యక్షుడిగా ఓంబిర్లా వ్యవహరించారు.
- కోటా లోక్‌సభ స్థానం నుంచి 16వ, 17వ లోక్‌సభకు బీజేపీ అభ్యర్థిగా ఓంబిర్లా ఎన్నికయ్యారు.
- లోక్‌సభ ఎంపీగా తన మొదటి టర్మ్‌లో బిర్లా 86 శాతం హాజరయ్యారు. 671 ప్రశ్నలు అడిగారు. 163 డిబేట్‌లలో పాల్గొన్నారు.
- 2019 ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచాక ఆయనకు లోక్‌సభ స్పీకర్ పదవిని బీజేపీ హైకమాండ్ కేటాయించింది.
- 2024లోనూ ఓం బిర్లా 41వేల ఓట్ల తేడాతో కోటా స్థానం నుంచి గెలిచారు.
- 2019 నుంచి 2024 వరకు 17వ లోక్‌సభ దాని నిర్ణీత సమయంలో 97 శాతానికిపైగా పనిచేసింది. అయితే అత్యల్ప సంఖ్యలో సమావేశాలు జరిగిన లోక్‌సభా కాలంగా ఇది చరిత్రలో నిలిచిపోయింది.
- 17వ లోక్‌సభ కాలంలో మొత్తం 272 సమావేశాలు జరిగాయి.
- స్పీకర్‌గా ఓం బిర్లా ఉండగానే కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మించడం సహా మూడు క్రిమినల్ చట్టాలను ఆమోదించారు. ఆర్టికల్ 370 రద్దు సైతం జరిగింది. ఈయన హయాంలోనే పౌరసత్వ సవరణ చట్టం, రామ మందిర ప్రతిష్ఠపై తీర్మానం చేశారు.
- ఎంపీ మహువా మొయిత్రాను లోక్‌సభ నుంచి బహిష్కరించడం, లోక్‌సభలో భద్రతా ఉల్లంఘనపై దాదాపు 100 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం వంటి నిర్ణయాలన్నీ ఓం బిర్లా హయాంలోనే వెలువడ్డాయి.
సురేశ్‌కు సుప్రీం క్లీన్ చిట్!
- విపక్ష ఇండియా కూటమి తరఫున స్పీకర్ పదవికి కాంగ్రెస్ పార్టీ కేరళ ఎంపీ కొడికున్నిల్ సురేశ్ పోటీ చేస్తున్నారు.
- కె సురేశ్ ఒక లా గ్రాడ్యుయేట్. ఈయన ఇప్పటివరకు 8 సార్లు లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు.
- 66 ఏళ్ల సురేశ్ కేరళలోని మావెలిక్కర (ఎస్సీ) నియోజకవర్గం నుంచి కేవలం 10,000 ఓట్ల తేడాతో గెలిచారు.
- సురేశ్ ఇంటిపేరు కొడికున్నిల్. ఇదొక పట్టణం పేరు. కొడికున్నిల్ అనేది తిరువనంతపురం పరిధిలో ఉండే ఓ పట్టణం. కొడికున్నిల్ పట్టణంలో 1962 జూన్ 4న కె సురేష్ జన్మించారు.
- సురేశ్ తొలిసారిగా 1989లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. తదుపరిగా 1991, 1996, 1999 లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆయన గెలిచారు. అయితే 1998, 2004 ఎన్నికల్లో ఓడిపోయారు.
- 1989లో తొలిసారిగా అదూర్ స్థానం నుంచి గెలిచి లోక్‌సభలోకి అడుగుపెట్టిన సురేశ్, ఆ తర్వాత 1991, 1996, 1999లలో కూడా అదే నియోజకవర్గం నుంచి గెలిచారు.
- డీలిమిటేషన్ తర్వాత అదూర్ లోక్‌సభ నియోజకవర్గం విభజన జరిగింది.
- 2009 ఎన్నికల్లో 48,046 ఓట్ల తేడాతో మావెలిక్కర లోక్‌సభ స్థానం నుంచి సురేష్ ఎన్నికయ్యారు.
- మావెలిక్కర లోక్‌సభ స్థానంలో సురేశ్ గెలుపును సమీప ప్రత్యర్థి కోర్టులో సవాల్ చేశారు. సురేశ్ నకిలీ కుల ధృవీకరణ పత్రాన్ని తయారు చేశారని, ఆయన క్రైస్తవుడని కోర్టులో పిటిషన్ వేశారు. కేరళ హైకోర్టు సురేశ్ ఎన్నిక చెల్లదని ప్రకటించింది. దీనిపై సురేశ్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగా, కేరళ హైకోర్టు నిర్ణయాన్ని తోసిపుచ్చింది.
- 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లోనూ సురేశ్ గెలిచారు.
- సురేశ్ అనేక పార్లమెంటరీ కమిటీలలో సభ్యుడిగా ఉన్నారు. గతంలో కేరళ కాంగ్రెస్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగానూ పనిచేశారు.
ఓం బిర్లా X సురేశ్- స్పీకర్ ఎవరు? 1946 తర్వాత మళ్లీ ఇప్పుడే ఎన్నిక! - Lok Sabha Speaker Election
చరిత్రలో తొలిసారిగా స్పీకర్ పదవికి ఎన్నికలు - మద్దతుకు విపక్షాలు నో! - Parliament Session 2024