Lok Sabha Elections 2024 First Phase : సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. శుక్రవారం 102 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 1951-52 నాటి ఎన్నికలు మినహా దేశ చరిత్రలో సుదీర్ఘ కాలం పాటు జరుగుతున్న ఈ ఎన్నికలకు ఈసీ పటిష్ఠ ఏర్పాట్లు చేసింది. ఈవీఎంలు, వీవీప్యాట్ల పంపిణీ పూర్తి కాగా సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు తరలి వెళ్లారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం!
102 లోకసభ స్థానాలకు జరిగే పోలింగ్‌లో 16.63 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనుండగా, ఇందుకోసం 1.87 లక్షల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుమారు 18 లక్షల మంది సిబ్బంది ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ జరగనుంది. కొండ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం ఐదు గంటలకే ముగియనుంది.
తొలివిడత ఎన్నికలు జరిగే 102 స్థానాల్లో 73 జనరల్, 11 ఎస్టీ, 18 ఎస్సీ నియోజకవర్గాలు ఉండగా, 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో 1491 మంది పురుషులు, 134 మంది మహిళలు ఉన్నారు. 16.63 కోట్ల మంది ఓటర్లలో 8.4 కోట్లు పురుషులు, 8.23 కోట్లు మహిళలు కాగా, 11 వేల 371 మంది థర్డ్ జెండర్లు ఉన్నట్లు ఈసీ వెల్లడించింది. 35.67లక్షలమంది తొలిసారి ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
41 హెలికాప్టర్లు, 8 ప్రత్యేక రైళ్లు, లక్ష వాహనాలు!
85 ఏళ్లు దాటిన 14.14 లక్షల మంది వృద్ధులు, 13.89 లక్షల మంది దివ్యాంగులు వారికి సౌకర్యం ఉన్న చోట ఓటుహక్కు వినియోగించుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్న ఈసీ, 102 నియోజకవర్గాల పరిధిలో 5 వేలకు పైగా పోలింగ్ కేంద్రాల్లో పూర్తిగా మహిళలే విధులు నిర్వహిస్తున్నట్లు వివరించింది. వెయ్యి పోలింగ్ కేంద్రాలను దివ్యాంగులు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. తొలివిడత పోలింగ్ నిర్వహణ కోసం 41 హెలికాప్టర్లు, 8 ప్రత్యేక రైళ్లు, లక్ష వాహనాలు వినియోగిస్తున్నట్లు ఈసీ పేర్కొంది.
ఎన్నికలను శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు ఈసీ పలు కీలక చర్యలు చేపట్టింది. పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలను మోహరించింది. 50శాతం కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలో వెబ్‌కాస్టింగ్ చేయడం సహా అన్ని పోలింగ్ కేంద్రాలకు మైక్రో అబ్జర్వర్‌లను నియమించింది. తొలిదశ పోలింగ్ కోసం మొత్తం 361 పరిశీలకులను నియమించిన ఈసీ, వారిలో 127 మంది సాధారణ పరిశీలకులు, 67 మంది పోలీసు పరిశీలకులు, 167 మంది వ్యయ పరిశీలకులు ఉన్నట్లు వివరించింది. 4వేల 627 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, 5వేల 208 స్టాటిస్టిక్స్ సర్వైలెన్స్ టీమ్‌లు, 2వేల 28 వీడియో సర్వైలెన్స్ టీమ్‌లు, 1255 వీడియో వ్యూయింగ్ టీమ్‌లను ఏర్పాటు చేసింది.
పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో!
తమిళనాడు, ఉత్తరాఖండ్ సహా పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని అన్ని స్థానాలకు ఈ దశలోనే పోలింగ్ పూర్తి కానుంది. అత్యధికంగా తమిళనాడులో 39, ఉత్తరాఖండ్‌లో 5, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయలో రెండేసి, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, అండమాన్ నికోబార్, లక్ష్యదీప్, పుదుచ్చేరిలో ఒక్కో స్థానానికి శుక్రవారం పోలింగ్ జరగనుంది. మణిపుర్‌లో రెండు స్థానాలకు కూడా తొలివిడతలోనే పోలింగ్ జరగాల్సి ఉన్నప్పటికీ ఔటర్ మణిపుర్ నియోజకవర్గంలో మాత్రం మొదటి రెండు దశల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
80 స్థానాలు ఉన్న ఉత్తర్‌ప్రదేశ్, 40 సీట్లు ఉన్న బిహార్, 42 సీట్లు ఉన్న బంగాల్లో మొత్తం ఏడు విడతల్లోనూ పోలింగ్ ఉండగా తొలివిడత యూపీలో 8, బిహార్‌లో 4, బంగాల్లో 3 నియోజకవర్గాల్లో ఓటింగ్‌కు ఏర్పాట్లు జరిగాయి. అసోంలో 5, ఛత్తీస్‌గఢ్‌లో ఒకటి, మధ్యప్రదేశ్ 6, మహారాష్ట్ర 5, రాజస్థాన్ 12, జమ్ముకశ్మీర్‌లో ఒక నియోజకవర్గానికి పోలింగ్ జరగనుంది.102 లోకసభ నియోజకవర్గాలతోపాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల్లోని 92 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
తమిళనాడులో 68వేల పోలింగ్ కేంద్రాలు!
తమిళనాడులో 39 స్థానాలకు 950 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా 6.23కోట్ల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకోసం ఎన్నికల సంఘం 68వేల పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. రాజస్థాన్‌లో 12స్థానాలకు పోలింగ్ జరగనుండగా 114 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సుమారు 2.54కోట్ల ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. యూపీలో 8 స్థానాలకు 80 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా, కోటీ 43 లక్షల మంది ఓటు వినియోగించుకోనున్నారు. ఉత్తరాఖండ్‌లో ఐదు స్థానాలకు 55 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 83లక్షల మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనుండగా, పోలింగ్ కోసం ఈసీ 11వేల 728 కేంద్రాలను ఏర్పాటు చేసింది.
లోక్‌సభ ఎన్నికల తొలి దశ ప్రచారానికి తెర- తమిళనాడుపై ఫుల్ ఫోకస్! - Lok Sabha Election 2024