Kerala CM On Ramoji Rao Demise : రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు మృతి పట్ల కేరళ సీఎం పినరయి విజయన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మీడియా, సినీ రంగాల్లో ఆయన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. కేరళ కష్టాల్లో ఉన్నప్పుడు రామోజీరావు ఆదుకున్నారని గుర్తుచేశారు. వరదలు అతలాకుతలం చేసినపుడు అండగా నిలిచారని చెప్పారు. వరద బాధితుల కోసం రామోజీ ఫౌండేషన్ ఇళ్లు నిర్మించిందని తెలిపారు. ఉత్సుకత, దూరదృష్టి, సంకల్పంతో ప్రతి రంగంలో రామోజీరావు చెరగని ముద్ర వేశారు చెప్పారు. ఎంతోమందిలో స్ఫూర్తి నింపారని తెలిపారు. ఆయన మరణం దేశానికి తీరని లోటు అన్నారు.
2018లో వచ్చిన వరదలు కేరళను అతలాకపతలం చేశాయి. వరదల్లో స్వరం కోల్పోయినవారికి అండగా నిలిచేందుకు రామోజీ గ్రూపు సంస్థల తరఫున ఛైర్మన్ రామోజీరావు రూ.3 కోట్లతో 'ఈనాడు' సహాయనిధిని ఏర్పాటుచేశారు. అలాగే మానవతావాదులూ ఇతోధికంగా సాయం చేయాలంటూ పిలుపునిచ్చారు. ఈ పిలుపును అందుకున్న ప్రజలు, చిరు వ్యాపారులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, ఎన్‌ఆర్‌ఐలు ఇలా ఎందరో సహృదయులు తమకు సాధ్యమైనంత మేరకు విరాళాలు అందించారు. వారి దాతృత్వ హృదయాన్ని సాక్షాత్కరిస్తూ నిధి రూ.7.77 కోట్లకు చేరింది. ఆ డబ్బుతో అలెప్పీ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో సర్వం కోల్పోయిన 121 కుటుంబాలకు 'ఈనాడు' ఆధ్వర్యంలో రెండు పడక గదుల ఇళ్లు కట్టించారు.
'పత్రిక రంగానికి తీరని లోటు'
రామోజీరావు మృతి చలనచిత్రం, పత్రిక రంగానికి తీరని లోటు అని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే అన్నారు. రామోజీరావు ఎంచుకున్న రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి ఎంతో మందికి మార్గదర్శకుడిగా నిలిచారని తెలిపారు. ఆయన చేసిన కృషి చిరకాలం గుర్తుండిపోతుందని అన్నారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన మృతి పట్ల ఎడిటర్స్ గిల్డ్ సైతం విచారం వ్యక్తం చేసింది.
"ఎడిటర్స్ గిల్డ్ మాజీ అధ్యక్షుడు రామోజీరావు మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. మీడియా మెఘల్‌గా ప్రజల గుండెల్లో నిలిచిన రామోజీరావు ఎన్నో మార్గాల్లో మనందరికీ మార్గనిర్దేశకులు. నిర్భయంగా నిజాలు మాట్లాడే గొప్ప వ్యక్తి. ఆయనో ఐకాన్. మీడియా రంగానికి ఆయన చేసిన కృషి దేశవ్యాప్తంగా జర్నలిస్టులందరికీ నిరంతరం స్ఫూర్తి కలిగిస్తుంది"
- ఎడిటర్స్ గిల్డ్
రామోజీరావు మృతి పట్ల ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ సంతాపం వ్యక్తం చేశారు. మీడియా, చిత్ర రంగానికి ఇది కోలుకోలేని నష్టమని పేర్కొన్నారు. ఆయన చేసిన సేవ చిరకాలం గుర్తిండిపోతుందని అన్నారు. అలాగే రామోజీరావు మృతిపై ఝార్ఖండ్, తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పాత్రికేయ, సినీరంగంపై రామోజీరావు చెరగని ముద్ర వేశారని, ఆయన అందించిన సహాకారం మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.