Grandmother Donate Kidney To Grandson : 70 ఏళ్ల వృద్ధురాలు తన మనవడికి కిడ్నీని దానం చేసి అతడి ప్రాణాలు కాపాడింది. 23 ఏళ్ల యువకుడి కిడ్నీ పాడైందని వైద్యులు చెప్పడం వల్ల ఆ వృద్ధురాలి మనసు తల్లడిల్లిపోయింది. అంత వయసులోనూ తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ మనవడికి కిడ్నీ ఇచ్చి కాపాడుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని జబల్ పుర్లో జరిగింది.
అసలేం జరిగిందంటే?
జబల్‌పుర్‌లోని సిహోరాకు చెందిన 23 ఏళ్ల యువకుడు గత కొంత కాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. దీంతో అతడి రెండు కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడం వల్ల తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడేవాడు. చికిత్స తీసుకున్నా లాభం లేకపోయింది. ఈ క్రమంలో యువకుడికి కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు. అప్పుడు యువకుడి కుటుంబీకులు కిడ్నీ కోసం అన్వేషణ ప్రారంభించారు.
యువకుడు, బామ్మ బ్లడ్ గ్రూప్ ఒక్కటేనని రక్త పరీక్షల్లో తేలింది. అలాగే వారిద్దరికీ రక్త, ఇతర పరీక్షలు చేశారు వైద్యులు. దీంతో పాటు బామ్మ ఆరోగ్యాన్ని పరీక్షించారు. ఈ క్రమంలో యువకుడికి బామ్మ కిడ్నీ మ్యాచ్ అయ్యింది. అప్పుడు జబల్పుర్ మెట్రో ఆస్పత్రి వైద్యులు విశాల్ బదేరా, రాజేశ్ పటేల్ ఆపరేషన్ చేసి బామ్మ కిడ్నీని మనవడికి అమర్చారు. ఆపరేషన్ సక్సెస్ కావడం వల్ల మనవడు, బామ్మ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారు.
ఇదే మొదటిసారి!
కిడ్నీ మార్పిడి ప్రస్తుత కాలంలో సర్వసాధారణమైనప్పటికీ, ఇంత పెద్ద వయసులో ప్రాణాన్ని పణంగా పెట్టి బామ్మ కిడ్నీ దానం చేయడం గమనార్హం. వృద్ధురాలి శరీరం నుంచి కిడ్నీని తొలగించడం ఆరోగ్యపరంగా చాలా తీవ్రమైన విషయం అయినప్పటికీ, వైద్యులు ఒక నెల మొత్తం బామ్మ శారీరక సామర్థ్యాన్ని పరిశీలించారు. ఆ తర్వాతే ఈ ఆపరేషన్ చేశారు.
73 ఏళ్ల వయసులో బామ్మ కిడ్నీ దానం
అచ్చం ఇలాంటి ఘటనే కొన్నాళ్ల క్రితం కర్ణాటకలోని బెళగావిలో జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న మనవడి ప్రాణాలు కాపాడింది 73 ఏళ్ల బామ్మ. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న మనవడిని చూడలేని ఆ వృద్ధురాలు తన కిడ్నీనే ఇచ్చింది. బెళగావి జిల్లాలోని హరుగేరి ప్రాంతానికి చెందిన సచిన్(21) అనే యువకుడు 18 ఏళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. అతడి కిడ్నీ ఒకటి పూర్తిగా ఫెయిలైంది. దీంతో వారానికి రెండు సార్లు సచిన్ డయాలసిస్ చేసుకోవాల్సి వచ్చేది. తల్లిదండ్రులు కూడా అనారోగ్యంతో ఉండడం వల్ల వారి కిడ్నీలను అతడికి అమర్చేందుకు వీలు కాలేదు. దీంతో సచిన్ పడుతున్న బాధను చూడలేని బామ్మ మనవడికి తన కిడ్నీని ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ఏడు పదుల వయస్సులోనూ కిడ్నీ దానం చేసింది. రవీంద్ర మద్రాకి అనే డాక్టర్ ఈ ఆపరేషన్‌కు నేతృత్వం వహించారు. ఈ వయస్సులోనూ కిడ్నీ దానం చేసిన వృద్ధురాలిని వైద్యుల బృందం ఘనంగా సత్కరించింది.