CAA Implementation In India : పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) దేశ వ్యాప్తంగా వారం రోజుల్లోగా అమలు చేస్తామని కేంద్రమంత్రి శంతనూ ఠాకుర్ ప్రకటించారు. బంగాల్‌లో దక్షిణ 24 పరగణాల జిల్లా కాక్‌ద్వీప్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'కేవలం బంగాల్లోనే కాదు దేశవ్యాప్తంగా రానున్న వారం రోజుల్లో సీఏఏ అమల్లోకి వస్తుందని నేను హామీ ఇస్తున్నా. బంగాల్ సీఎం మాత్రం 1971 తర్వాత భారత్‌కు వచ్చినవారు, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు ఉన్నవారు దేశ పౌరులే అని చెబుతున్నారు. మతువా కులానికి చెందినవారు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని వేల మందికి ఓటర్ ఐడీలు జారీ చేసేందుకు తిరస్కరించారు. ఇది వారి రాజకీయ అజెండాకు పనికి వస్తుంది. 1971 తర్వాత వలస వచ్చినవారి జీవితాలు బాగుపడటానికి పౌరసత్వం ఉపయోగపడుతుంది. అందుకే కేంద్రం సీఏఏను తీసుకొచ్చింది' అని శంతనూ ఠాకుర్ తెలిపారు.
బంగాల్‌లోని బంగాన్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు శంతనూ ఠాకుర్. ప్రస్తుత కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రిగా శాంతనూ ఠాకుర్ ఉన్నారు. బంగాన్ ప్రాంతంలో ఎక్కువగా మతువా తెగ ప్రజలు ఉంటారు.
'లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎప్పుడైనా సీఏఏ అమలు కావచ్చు'
పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) దేశవ్యాప్తంగా వారం రోజుల్లో అమల్లోకి వస్తుందని కేంద్ర మంత్రి శంతనూ ఠాకుర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ(MHA) స్పందించింది. సీఏఏ అమలుకు కచ్చితమైన కాలవ్యవధి నిర్ణయించలేదని స్పష్టం చేసింది. 'సీఏఏ అమలుకు కచ్చితమైన కాల వ్యవధి లేదు. అయితే, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎప్పుడైనా సీఏఏ అమలు కావచ్చు' అని హోం మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
సీఏఏపై తృణమూల్ స్పందన
సీఏఏపై కేంద్రమంత్రి ఠాకుర్ వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తమ పార్టీ ఎప్పటికీ బంగాల్‌లో సీఏఏను అమలు చేయదని తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో లబ్ది పొందడం కోసమే బీజేపీ తప్పుడు వాగ్దానాలు ఇస్తోందని విమర్శించారు.
అమిత్ షా వ్యాఖ్యలు
గతేడాది నవంబరు నెలలో కోల్‌కతాలో జరిగిన ఓ సభలో సీఏఏను అమలు చేసి తీరుతామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చిచెప్పారు. దీనిని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార ప్రారంభ కార్యక్రమంలోనూ అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. బుజ్జగింపు రాజకీయాలు, సరిహద్దు చొరబాట్లు, అవినీతి, రాజకీయ హింస వంటి వాటితో రాష్ట్రాన్ని నాశనం చేశారని బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని విమర్శించారు. తాజాగా అమిత్‌షా వ్యాఖ్యలను శాంతనూ పునరుద్ఘాటించారు.
ఈడీ విచారణకు లాలూ- ఎన్డీఏ సర్కార్ ఏర్పాటైన మరుసటి రోజే
బిహార్ అసెంబ్లీ స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం! సీఎం తొలి కేబినెట్ మీటింగ్