Kejriwal Wife Reaction : శరీరంలోని ప్రతీ రక్తపు బొట్టూ దేశానికే అంకితం చేశానని మద్యం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం కేజ్రీవాల్ సందేశాన్ని పంపించారు. ప్రజలకు పంపించిన ఆ సందేశాన్ని ఆయన సతీమణి సునితా కేజ్రీవాల్ చదివి వినిపించారు. తన జీవితంలోని ప్రతీ క్షణాన్ని దేశ సేవకే అంకితం చేశానని, జైళ్లో ఉన్నా బయట ఉన్నా ఇకపై కూడా అదే చేస్తానని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
'ఆప్ ప్రభుత్వం వస్తే మహిళలకు వెయ్యి రూపాయల ఆర్థిక సాయం చేస్తామన్నాం. అది అందుతుందో లేదోనని ఇప్పుడు తల్లులు, అక్కాచెల్లెల్లు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంలో తనను నమ్మండి. త్వరలో వచ్చి ప్రతీ హామీని నెరవేర్చుతాను. నా కోసం ఆలయాలకు వెళ్లి దేవుడి ఆశీస్సులు తీసుకోండి. నేను పోరాడటానికే పుట్టాను. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తూనే ఉంటుంది. ప్రపంచంలో భారత్ ఒక గొప్ప, బలమైన దేశం కావాలని ఆకాంక్షిస్తున్నా. భారత్‌ను బలహీన పరచాలని దేశం వెలుపలి, లోపలి శక్తులు కుట్ర చేస్తున్నాయి. ఆ శక్తులను ఓడించాలి.' అని కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని సునితా చదివారు.
'జేపీ నడ్డాను అరెస్ట్ చేయాలి'
దిల్లీ మద్యం కేసులో గత రెండేళ్లుగా సోదాలు, విచారణలు చేపట్టినప్పటికీ ఆప్ నేతలు ఎవరూ కూడా అక్రమ నగదు లావాదేవీలు చేసినట్లు ఈడీ నిరూపించలేకపోయిందని ఆ రాష్ట్ర మంత్రి ఆతిశీ అన్నారు. అసలు డబ్బు జాడ ఎక్కడ ఉంది? అసలు అంత నగదు ఎక్కడికి పోయింది? అంటూ ఈడీని ప్రశ్నించారు. బీజేపీ ఖాతాల్లోనూ అక్రమ నగదు లావాదేవీలు జరిగాయని, దీనిపై దర్యాప్తు చేసి అధ్యక్షుడు జేపీ నడ్డాను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కేవలం శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఆధారంగా మాత్రమే సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని ఆతిశీ తెలిపారు.
'అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డిని 2022 నవంబర్9న విచారణకు పిలిచినప్పడు తాను అరవింద్ కేజ్రీవాల్‌ను ఎప్పుడూ కలవలేదు, మాట్లాడలేదని, ఆప్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ మరుసటి రోజే ఈడీ శరత్‌ను అరెస్టు చేసింది. ఆ తర్వాత జైలులో ఉన్నప్పుడే తన మాటను మార్చుకున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ కలిశానని, దిల్లీ మద్యం పాలసీ విషయంపై మాట్లాడని చెప్పగానే బెయిల్ లభించింది. ఆ తర్వాత ఎలక్టోరల్ బాండ్ల ద్వారా బీజేపీకి కోట్లాది రూపాయలు ఇచ్చారు' అని ఆతిశీ పేర్కొన్నారు.
పోలీసు అధికారిపై కేజ్రీవాల్ ఆరోపణలు
మరోవైపు ఒక పోలీసు అధికారి తన పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు తనను తరలిస్తుండగా ఏకే సింగ్ అనే అసిస్టెంట్ కమిషనర్ తన పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. ఆ పోలీసు అధికారిని భద్రతా వలయం నుంచి తొలగించాలని న్యాయస్థానంలో దాఖలు చేసిన దరఖాస్తులో కోరినట్లు దిల్లీ సీఎం తెలిపారు. అయితే ఏకే సింగ్ ఏ విధంగా ప్రవర్తించారన్నది ఇంకా తెలియరాలేదు. ఇలాంటి ఆరోపణలు గతంలో కూడా ఉన్నాయి. గతంలో మద్యం కుంభకోణం కేసులోనే అరెస్టయిన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనిష్ సిసోదియా పట్ల ఏకే సింగ్ దురుసుగా ప్రవర్తించారు. రౌస్ అవెన్యూ కోర్టు ప్రాంగణంలో విలేఖరులు సిసోదియాను ప్రశ్నిస్తుండగా, ఏకే సింగ్ ఆయనను మెడ పట్టుకుని లాక్కెళ్లిపోయిన వీడియో సంచలనం రేపింది. అయితే నిందితులు మీడియాకు స్టేట్‌మెంట్లు ఇవ్వడం చట్టానికి విరుద్ధమని, అదీ కాక భద్రత కోసమే అలా చేశామని అప్పట్లో పోలీసులు వివరణ ఇచ్చారు.
మరో ఆప్ ఎమ్మెల్యే ఇంట్లో ఈడీ సోదాలు
మరోవైపు కేజ్రీవాల్ అరెస్టు వేళ ఆప్ ఎమ్మెల్యే గులాబ్ సింగ్‌కు చెందిన ప్రాంగణాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. దీనిపై దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ స్పందించారు. ప్రతిపక్ష నేతలందరినీ జైల్లో పెట్టడంలో బీజేపీ బిజీగా ఉందని ఈ దేశంతో పాటు ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ తెలుసని విమర్శించారు. ఇదిలా ఉంటే మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను ప్రత్యేక న్యాయస్థానం ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. దిల్లీ సీఎం అరెస్టు రాజకీయ కుట్రేనని ప్రతిపక్ష పార్టీలు ధ్వజమెత్తాయి.
జర్మనీ అత్యుత్సాహం
దిల్లీ మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకోవడం జర్మనీ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసిన ప్రకటన పెద్ద దుమారం రేపింది. కేజ్రీవాల్ విచారణ పారదర్శకంగా జరగాలంటూ అనవసర వ్యాఖ్యలు చేసింది. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దిల్లీలోని జర్మనీ రాయబారిని కేంద్ర విదేశాంగ శాఖ పిలిచి నిలదీసింది.