Haryana Elections 2024 : హరియాణాలో మరోసారి అధికారం చేపట్టాలని బీజేపీ ఉవ్విళ్లూరుతుంది. ఈసారి ఎలాగైనా కమలదళాన్ని సీఎం పీఠం నుంచి దించి అధికారం చేపట్టాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. శాసనసభ ఎన్నికలకు మరికొద్ది రోజుల సమయం ఉండడం వల్ల ఇరుపార్టీలు ప్రచారం, అభ్యర్థుల ఖరారులో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో హరియాణా మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అనిల్ విజ్ సీఎం పోస్టుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
'నాకు సీఎం పోస్టు ఇవ్వాలి'
హరియాణా బీజేపీ ఎమ్మెల్యేలో తానే సీనియర్‌ను అని ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐతో అనిల్ విజ్ చెప్పారు. తాను ఆరుసార్లు పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేశానని గెలిచానని, ఏడో సారి బరిలో ఉన్నానని పేర్కొన్నారు. ఇప్పటికి వరకు అధిష్ఠానాన్ని ఏమీ అడగలేదని తెలిపారు. పార్టీలో తన సీనియారిటీ, ప్రజాభీష్టం మేరకు తన సీఎం పదవి ఇవ్వాలని అధిష్ఠానాన్ని కోరారు. సీఎం పోస్టుపై నిర్ణయం హైకమాండ్ చేతుల్లో ఉందని వెల్లడించారు.
'నన్ను సీఎం చేస్తే రాష్ట్రం రూపురేఖల్ని మారుస్తా'
"నన్ను సీఎం చేస్తారా లేదా అన్నది హైకమాండ్ చేతిలో ఉంది. నన్ను సీఎంను చేస్తే హరియాణా రూపురేఖల్ని మారుస్తాను. రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పదవిని కోరుతాను. హరియాణాలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు నన్ను కలుస్తున్నారు. మీరు చాలా సీనియర్ కదా సీఎం ఎందుకు కాలేదని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికలకు రెండు వారాల సమయమే ఉంది. అందుకే సీఎం పోస్టు కోసం హైకమాండ్‌ను అడుగుతాను." అని అనిల్ విజ్ వ్యాఖ్యానించారు.
సైనీని ప్రకటించిన బీజేపీ
కాగా, రాష్ట్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే నాయబ్ సింగ్ సైనీ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని బీజేపీ ఇప్పటికే ప్రకటించింది. ఈ తరుణంలో అనిల్ విజ్ సీఎం పోస్టుపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్ ఆశించి భంగపడ్డవారు పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. రంజిత్ సింగ్ చౌతాలా, లక్ష్మణ్ నాపా, కరణ్ దేవ్ కాంబోజ్‌తో పాటు మరికొంత మంది బీజేపీ నేతలు పార్టీని వీడారు.
ప్రస్తుతం అనిల్ విజ్ అంబాలా కాంట్ నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. హరియాణా బీజేపీలో ఆయన సీనియర్ నేత. ఈ ఏడాది మార్చిలో మనోహర్ లాల్ స్థానంలో నయాబ్ సింగ్ సైనీని సీఎంగా నియమించడం వల్ల అనిల్ అసంతృప్తికి లోనయ్యారు. ఆ తర్వాత సైనీ మంత్రివర్గంలోనూ విజ్‌కు చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో సైనీ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా విజ్ హాజరుకాలేదు.
హరియాణా అసెంబ్లీ ఎన్నికల తేదీలో మార్పు - పోలింగ్ ఎప్పుడంటే? - Haryana Election 2024