AI Create Picture Of Missing Child : 13 ఏళ్ల క్రితం తప్పిపోయిన చిన్నారి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్‌ను ఆశ్రయించారు తమిళనాడు పోలీసులు. 2 ఏళ్ల వయసులో దిగిన ఆమె ఫొటోను ఉపయోగించి ఏఐ ద్వారా 15 ఏళ్ల వయసులో ఎలా ఉంటుందో చిత్రాన్ని రూపొందించారు. తద్వారా చిన్నారి ఆచూకీ తెలుసుకునేందుకు చర్యలు ప్రారంభించారు. అయితే తమ కుమార్తెను ఎత్తుకెళ్లిన దుండగులు తిరిగి తమకు అప్పగించాలని ఆమె తల్లిదండ్రులు కోరారు.
అసలేం జరిగిందంటే?
చెన్నైలోని సాలిగ్రామానికి చెందిన గణేశన్ అనే వ్యక్తి స్థానిక కోఆపరేటివ్ బ్యాంక్‌లో జ్యువెలరీ అప్రైజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమార్తె కవిత 2011 సెప్టెంబర్ 19వ తేదీన అదృశ్యమైంది. ఆ రోజు సాయంత్రం 5 గంటల సమయంలో ఇంటి బయట ఆడుకుంటూ తప్పిపోయింది. వెంటనే పోలీసులకు చిన్నారి తండ్రి ఫిర్యాదు చేశారు. గణేశన్ దంపతులు కూడా అప్పటి నుంచి తమ చిన్నారిని వెతుకుతూనే ఉన్నారు.
క్లోజ్ చేస్తామని చెప్పడం వల్ల!
అయితే 2022లో చిన్నారి అదృశ్యమైన కేసును పోలీసులు క్లోజ్ చేస్తామని గణేశన్ చెప్పారు. దీంతో ఆయన పోలీసుల నిర్ణయానికి వ్యతిరేకంగా చెన్నై సైదాపేట కోర్టును ఆశ్రయించారు. కోర్టు జోక్యంతో పోలీసులు ఆ కేసుపై దర్యాప్తు కొనసాగించారు. ఇటీవల సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆశ్రయించారు. చిన్నారి చిత్రాలు ఇవ్వమని గణేశన్‌ను అడిగారు. తమ ఇంట్లో జరిగిన పలు శుభకార్యాల సమయంలో తీసిన ఫొటోల్లో కవిత ఉన్నట్లు గుర్తించారు.
కన్నీళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులు!
అలా కవిత ఉన్న రెండు ఫొటోలను గణేశన్ పోలీసులకు అందించారు. ఆ రెండు ఫొటోలు కవిత రెండేళ్ల వయసులో ఉన్నప్పుడు తీసుకున్నవి. ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ ద్వారా కవిత 15 ఏళ్లప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు చిత్రాలు రూపొందించారు పోలీసులు. వాటిని గణేశన్‌కు కూడా అందించారు. ఏఐ ద్వారా సృష్టించిన కుమార్తె ఫొటో చూసి కవిత తల్లిదండ్రులు కన్నీరుపెట్టుకున్నారు.
అన్ని పోలీస్స్టేషన్లకు కూడా!
ఏఐ రూపొందించిన ఫొటో ద్వారా తమ కుమార్తె దొరుకుతుందనే నమ్మకం వచ్చిందని చిన్నారి తల్లిదండ్రులు తెలిపారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేశామని చెప్పారు. బంధువులు, స్నేహితులకు కూడా షేర్ చేశామని తెలిపారు. తమ బిడ్డను ఎత్తుకెళ్లిన వారు తమకు తిరిగిచ్చేయాలని కోరారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో రూపొందించిన ఫొటోను అన్ని పోలీస్ స్టేషన్‌లకు పంపే ప్రక్రియను ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.