ADR Report On Sixth Phase Elections : సార్వత్రిక ఎన్నికల ఆరో విడతలో పోటీపడుతున్న 869 మంది అభ్యర్థుల్లో 39 శాతం కోటీశ్వరులేనని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) తెలిపింది. మొత్తం 57 స్థానాల్లో 866 మంది అఫిడవిట్లను విశ్లేషించగా, 338 మంది తేలినట్లు చెప్పింది. ఒక్కో అభ్యర్థి ఆస్తుల విలువ సగటున రూ.6.21 కోట్లుగా ఉందని వారి అఫిడవిట్లను విశ్లేషించి తన నివేదికలో పేర్కొంది.
హరియాణాలోని కురుక్షేత్ర నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి నవీన్ జిందాల్ అత్యధికంగా రూ.1241 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత సంతృప్త్ మిశ్రా (బీజేడీ, రూ.428 కోట్లు), సుశీల్ గుప్తా (ఆప్, రూ.169 కోట్లు) రెండో, మూడో స్థానంలో నిలిచారు. ప్రధాన పార్టీలపరంగా చూస్తే బీజేడీ నుంచి ఆరుగురు, బీజేపీ 48, ఎస్పీ 11, కాంగ్రెస్ 20, టీఎంసీ ఏడుగురు, ఆర్జేడీ, జేడీయూ, ఆప్‌ల నుంచి నలుగురు చొప్పున రూ.కోటికిపైగా ఆస్తులను వెల్లడించారు. రోహ్‌తక్ స్వతంత్ర అభ్యర్థి మాస్టర్ రణ్‌ధీర్ సింగ్ అత్యల్పంగా కేవలం రూ.2 విలువైన ఆస్తులను వెల్లడించగా, ప్రతాప్‌గఢ్‌లోని ఎస్‌యూసీఐ(సీ) అభ్యర్థి రామ్‌కుమార్ యాదవ్ రూ.1,686 విలువైన ఆస్తులను ప్రకటించారు.
21 శాతం మందిపై క్రిమినల్ కేసులు
మరోవైపు మొత్తం 866 మంది అభ్యర్థుల్లో 180 మంది (21 శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో ప్రకటించారని ఏడీఆర్ నివేదిక చెప్పింది. 141 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నట్లు వివరించింది. 12 మంది అభ్యర్థులు తాము దోషులుగా తేలిన కేసులను ప్రకటించగా, ఆరుగురు అభ్యర్థులు తమపై హత్య కేసులున్నట్లు చెప్పారు. 24 మందిపై మహిళా సంబంధిత నేరాలు, 16 మందిపై విద్వేషపూరిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు పేర్కొన్నారని నివేదికలో ఏడీఆర్ వెల్లిడించింది. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 25న ఆరో విడత పోలింగ్ జరగనుంది.
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల సమయంలో నిందితుల అఫిడవిట్‌లను విశ్లేషించే ఏడీఆర్, నేరమయమైన రాజకీయాలను చరమగీతం పాడేందుకు ఎన్నికల ప్రక్రియలో సంస్కరణలను చేపట్టాలని ప్రయత్నిస్తోంది. తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిని శాశ్వతంగా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తోంది. రాజకీయ పార్టీలను సమాచార హక్కు చట్టం కిందకు తీసుకొని రావడమే కాకుండా ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం పొందుపరిచే వారికి భారీ జరిమానాలు విధించాలని చెబుతోంది.