Abhishek Banerjee On Congress : రాబోయే లోక్సభ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంపై కాంగ్రెస్ వ్యవహరించిన తీరును బంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ తప్పుపట్టారు. బంగాల్‌లో విపక్ష 'ఇండియా' కూటమిలో విభేదాలకు ఆ పార్టీనే కారణమని విమర్శించారు.
"కూటమి నిబంధనల ప్రకారం మొదట సీట్ల సర్దుబాటు చేయాలి. ఈ విషయం గురించి గతేడాది జూన్లో కాంగ్రెస్ను అడిగాం. ఏడు నెలలు గడిచినా కాంగ్రెస్ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దిల్లీలో జరిగిన చివరి ఇండియా కూటమి సమావేశంలో మమతా బెనర్జీ డిసెంబర్ 31లోపు సీట్ల సర్దుబాటు విషయంపై ఒక నిర్ణయానికి రావాలని స్పష్టం చేశారు. అయినా సరే వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఏడు నెలలు గడిచినా ఇంత వరకు సీట్ల సర్దుబాటుపై ఏ నిర్ణయం తీసుకోలేదు." అని తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ విమర్శించారు.
అలాగే బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు అభిషేక్ బెనర్జీ. 'రాష్ట్రపతి పాలనను డిమాండ్ చేయడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏ పార్టీ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తున్నారు. మా సహనానికి కూడా ఓ హద్దు ఉంటుంది' అని అన్నారు. అయితే జాతీయస్థాయిలో మాత్రం తాము విపక్ష కూటమిలోనే కొనసాగుతామని పేర్కొన్నారు.
త్వరలోనే అధికారంగా సీట్ల సర్దుబాటు
ఈ విషయంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పందించారు. "మమతా బెనర్జీ చెప్పింది నిజమే. కానీ మనం ఒక కూటమిలో ఉన్నాం. టీఎంసీ, క్రాంగెస్ ప్రధాన లక్ష్యం బీజేపీని ఓడించటం. మమతా బెనర్జీ 40 స్థానాల నుంచి పోటీ చేస్తాం అని చెప్పారు. ఇది ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి. మనం ఒక ఒప్పందంలో ఉన్నప్పడు అన్ని పార్టీలు ఆ విషయాన్ని గ్రహించాలి. త్వరలోనే మేము అధికారికంగా సీట్ల సర్దుబాటు గురించి ప్రకటిస్తాం" అని జైరాం రమేశ్ అన్నారు.
ఒంటరిగా పోటీ చేస్తాం
ఇటీవలే ఇండియా కూటమికి షాక్ ఇస్తూ ఒంటరి పోరుకు సై అని మమతా బెనర్జీ ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకుండా ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. దేశంలో ఇతర స్థానాల్లో సీట్ల పంపకాల మాట ఎలా ఉన్నప్పటికీ బంగాల్‌లో ఒంటరిగా పోటీకి దిగి బీజేపీని ఓడిస్తామని అన్నారు. కానీ తాము ఇండియా కూటమిలో భాగంగానే ఉన్నామని, ఎన్నికల ఫలితాల తర్వాతే ఇండియా కూటమి గురించి ఆలోచిస్తామని తేల్చి చెప్పారు.
'కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోం'- ఒకే రోజు షాక్ ఇచ్చిన ఆప్, టీఎంసీ
దీదీ షాక్- బంగాల్‌లో టీఎంసీ ఒంటరి పోరు- చర్చలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్