శభాష్ సైనికా.. నదిలో చిక్కుకున్న నలుగురిని కాపాడిన ఆర్మీ
Indian Army Rescues Four People: ఇండియన్ ఆర్మీ.. శత్రువులకు ఎదురు నిలిచి ధైర్యసాహసాలు ప్రదర్శించడమే కాదు.. అవసరమైనపుడు రెస్క్యూ ఆపరేషన్లు నిర్వహించి పౌరులను కాపాడుతుంటుంది. ఆదివారం జమ్ముకశ్మీర్‌లోని సింధ్ నదిలో చిక్కుకున్న నలుగురిని సైనికులు రక్షించి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. విహారయాత్ర కోసం బల్తాల్ ప్రాంతానికి నలుగురు యాత్రికులు వెళ్లారు. వారు తమ వాహనంతో సింధ్ నదిని దాటాలని అనుకున్నారు. ఈ క్రమంలో నదిలో చిక్కుకున్నారు. దీంతో వారు అటు ఒడ్డుకు వెళ్లలేక, వెనక్కిపోలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అందులోనే ఉండిపోయారు. అయితే ఇదే సమయంలో అమర్‌నాథ్ యాత్ర కోసం బాల్టాల్-డోమెల్ వద్ద మొహరించిన ఇండియన్ ఆర్మీ పెట్రోలింగ్ బృందం నదిలో చిక్కుకున్న వాహనాన్ని గమనించింది. దీంతో వెంటనే రెస్క్యూ ఆపరేషన్ చేపట్టేందుకు అవసరమైన పరికరాలను తీసుకొని ఘటనా స్థలానికి చేరుకుంది. జేసీబీని ఉపయోగించి, వల సహాయంతో ఆ నలుగురు పౌరులను రక్షించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సైనికులపై ప్రశంసల జల్లు కురుస్తుంది.