మైనింగ్ మాఫియా బీభత్సం.. బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లిన ఇసుక ట్రాక్టర్లు - Mafia controlled Tractors Break Barricades
ఉత్తర్‌ప్రదేశ్‌లో మైనింగ్ మాఫియా రెచ్చిపోయింది. ఆగ్రాలో టోల్‌ప్లాజా వద్ద ఇసుక ట్రాక్టర్లు బీభత్సం సృష్టించాయి. టోల్‌గేట్ వద్ద మెుత్తం 13 ట్రాక్టర్లు బారికేడ్లను ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయాయి. ఈ సంఘటన అంతా అక్కడే ఉన్న సీసీటీవీల్లో రికార్డయింది. ఆగ్రా-గ్వాలియర్ జాతీయ రహదారిపై జాజవు టోల్‌ప్లాజా వద్ద ఈ సంఘటన ఆదివారం జరిగింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. టోల్ రుసుం చెల్లించాలని టోల్‌ప్లాజా సిబ్బంది మెుదటి ట్రాక్టర్‌ను అడ్డుకోగా.. డ్రైవర్ బారికేడ్లను ఢీకొట్టి వెళ్లిపోయాడు. అనంతరం వచ్చిన మరో 12 ట్రాక్టర్లు వేగంగా టోల్‌ప్లాజా బారికేడ్లను దాటి వెళ్లాయి. కర్రలు పట్టుకుని ట్రాక్టర్లను అడ్డుకునేందుకు టోల్ సిబ్బంది యత్నించినా ఫలితం లేకపోయింది. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లు గ్వాలియర్ నుంచి ఆగ్రావైపు వెళ్తున్నాయి. కేవలం 50 సెకన్ల వ్యవధిలోనే 13 ట్రాక్టర్లు టోల్‌బూత్‌ను దాటి వెళ్లాయి. రాజస్థాన్-ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా చంబల్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ పెరిగిపోవడం స్థానికులకు ఆందోళన కలిగిస్తోంది.
Last Updated : Sep 5, 2022, 3:21 PM IST