yadadri drone visuals: యాదాద్రి సుందర దృశ్యాలు.. చూపరులను కట్టిపడేసేలా నిర్మాణాలు
యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం పునఃప్రారంభానికి సమయం సమీపిస్తుండటంతో భక్తులకు స్వామివారి స్వయంభు దర్శనాలు కల్పించే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులను అత్యంత అద్భుతంగా రూపొందిస్తున్నారు. యాదాద్రి ఆలయపరిసరాలు, కొండ చుట్టూ ఏర్పాటు చేసిన వలయ రహదారి, ఏక జాతి కృష్ణశిలతో రూపొందించిన ఆలయం అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మాడవీధులు, కొండ కింద వైకుంఠ ద్వారం, కొండ దిగువన పచ్చదనం, మాడ వీధిలో పసిడి వర్ణంతో ఏర్పాటు చేసిన దర్శన వరుసలు, కొండపై అతిథిగృహాలు. పచ్చదనంతో నిండిన సర్కిళ్లు, రహదారికి ఇరువైపులా చెట్లు భక్తులను కట్టిపడేస్తున్నాయి. ఆ సుందర దృశ్యాలను డ్రోన్ కెమెరాల్లో బంధించగా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.