World Photography Day 2023 : మాదాపూర్‌లో ఫొటో ఎగ్జిబిషన్.. ఆ అద్భుతాలపై మీరూ ఓ లుక్కేయండి.. - ఫొటో ఎగ్జిబిషన్
World Photography Day 2023 : ఓ మనిషి చనిపోయినా.. అతని మరణానంతరం కూడా స్మరించుకోవడానికి ఉపయోగపడేవి ఒక్క ఫొటోలు మాత్రమే. ఇప్పుడంటే ప్రతి ఒక్కరి దగ్గర సెల్ఫోన్లు వచ్చేశాయ్ కానీ.. మన ముందు తరం వారు ఫొటోలతోనే జ్ఞాపకాలు నెమరవేసుకునే వారు. అప్పటికీ ఇప్పటికీ వన్నె తగ్గనిది ఫొటో ఒక్కటే. ఈ మధ్యకాలంలో రకరకాల ప్రదేశాల్లో ఫొటోలు తీస్తూ.. ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని తీసుకువస్తున్నారు మన ఫొటో గ్రాఫర్స్. నేడు అంతర్జాతీయ ఫొటోగ్రాఫర్ డే సందర్భంగా హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఫొటో వాక్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ హరి అనుమోలు హాజరై.. ఫొటో ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఫొటో వాకర్ హైదరాబాద్ సభ్యులు తీసిన ఫొటోలను తిలకించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో తీసిన ఫొటోలు ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫొటో గ్రాఫర్లు తమ ప్రతిభను వెలికి తీసి ఆ మధుర అనుభూతులను ప్రేక్షకులకు అందిస్తున్నారన్నారు. గతేడాది ఫొటో వాక్ హైదరాబాద్ పేరుతో ఒక టీంను ఏర్పాటు చేసుకొని అనుభవాలను పంచుకుంటూ విధులు నిర్వహిస్తున్నామని అసోసియేషన్ సభ్యులు తెలిపారు.