TTD Distribute Sticks to Devotees: కర్రలొచ్చాయి... తిరుమల కాలినడక భక్తులకు పంపిణీ - తిరుపతి జిల్లా లేటెస్ట్ న్యూస్
Published : Sep 6, 2023, 7:56 PM IST
TTD Distributes Sticks to Devotees in Tirumala: తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు కర్రలు ఇవ్వడం ద్వారా ఆత్మ విశ్వాసం పెరుగుతుందని తితిదే ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి అలిపిరి మెట్ల మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు ఈవో ధర్మారెడ్డితో కలిసి ఆయన ఊత కర్రలు పంపిణీ చేశారు. ఇటీవల నడక మార్గంలో చిరుత పులుల దాడులు నేపథ్యంలో తితిదే కర్రలు పంపిణీ ప్రక్రియ చేపట్టింది. భక్తులకు ఇచ్చిన కర్రలను కాలినడక మార్గంలోని నరసింహ తీర్థం తర్వాత తిరిగి స్వాధీనం చేసుకుంటామని తితిదే ఛైర్మన్ భూమన తెలిపారు.
చేతికి కర్రలు ఇచ్చి చేతులు దులుపునే పక్రియ కాదని.. మెట్ల మార్గంలో తితిదే భద్రత సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. చేతి కర్ర ఇవ్వడం ఒక్కటే మా పని అనుకోవడం లేదని.. విమర్శలను చేసే వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. పది వేల కర్రలను 45 వేల రూపాయలతో కొనుగోలు చేశామని తితిదే ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తుల భద్రత నిమిత్తమే కర్రలను కొనుగోలు చేశామన్నారు. వన్యప్రాణుల నుంచి రక్షణ కోసం చేతి కర్రలు అందిస్తున్నామని.. వంద మందిని బృందాలుగా పంపుతున్నామన్నారు. చిన్నపిల్లలు ఉన్న భక్తులను మధ్యాహ్నం రెండు గంటల వరకు కాలినడక మార్గంలోకి అనుమతిస్తున్నామన్నారు.