బంపర్ మెజార్టీతో ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపిస్తారు: రేవంత్‌రెడ్డి
Revanthreddy Responded to VenkatReddy Comments: జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో నేడు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర దేవరుప్పుల, ధర్మపురం, విస్నూర్ల మీదుగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా, పార్టీకి నష్టం కలిగించేలా ఎవరూ మాట్లాడవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
పాద యాత్రలో ప్రతి ఒక్కరూ తమ సమస్యలు నా దృష్టికి తీసుకు వస్తున్నారని, అందరూ మార్పు రావాలని కోరుకుంటున్నారని రేవంత్ అన్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలపై రేవంత్ స్పందించారు. వరంగల్ డిక్లరేషన్‌లో రాహుల్ స్పష్టంగా చెప్పారని ఏ పార్టీతో పొత్తులు అనేవి ఉండవని, రాహుల్‌గాంధీ నిర్ణయాలు అమలు చేయడమే నా బాధ్యత అని రేవంత్ స్పష్టం చేశారు.
ప్రజలు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు రావడానికి సిద్ధంగా ఉన్నారని, అధికారంలోకి వస్తున్నప్పుడు పొత్తుల గురించి చర్చే ఉత్పన్నం కాదని అన్నారు. బంపర్ మెజార్టీతో ప్రజలు తమ పార్టీని గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వేలు, చిలక జోస్యం, హస్త సాముద్రికం గురించి తనకి తెలియదన్నారు. కొద్ది మంది నాయకులు ఏసీ గదుల్లో ఉండి విలాసవంతమైన జీవితాల కోసం కావలసినప్పుడల్లా రకరకాలుగా మాట్లాడే వారు చేసే వ్యాఖ్యలపై తన దృష్టి ఉండదన్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయో, అభ్యర్థులెవరో ఇప్పుడే ఇంకా తెలియదని వెల్లడించారు. పార్టీలో పరిణామాలను అధిష్ఠానం పరిశీలిస్తూ ఉంటుందని రేవంత్ పేర్కొన్నారు. పార్టీ సమయానుగుణంగా అన్నింటికీ పరిష్కారం చూపుతుందని ఆయన తెలిపారు.