Vanasthalipuram Robbery Video : కస్టమర్‌లా వచ్చాడు.. రూ.1 లక్ష దోచుకుపోయాడు - Vanasthalipuram Robbery Case
Vanasthalipuram Robbery Case : కిరాణా జనరల్ స్టోర్‌లో వస్తువులు కొనడానికి కస్టమర్‌లా వచ్చాడు. క్యాష్ కౌంటర్ వద్ద ఎవరూ లేని విషయాన్ని గమనించి.. రూ.1 లక్ష సొత్తును ఎత్తుకెళ్లిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ సిటీ పరిధిలోని వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీలో చోటుచేసుకుంది. వెంటనే బాధితుడు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో.. వారు అక్కడకు చేరుకొని సీసీ పుటేజీ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు.
బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. వనస్థలిపురంలో ఉన్న ఎన్జీవోస్ కాలనీలోని శ్రీనివాస కిరాణా జనరల్ స్టోర్‌లోకి కస్టమర్‌లా వచ్చిన ఓ దుండగుడు.. క్యాష్ కౌంటర్ వద్ద ఎవరూ లేని సమయంలో కౌంటర్‌లోని రెండు రూ.500 నోట్ల కట్టలు (విలువ రూ.1 లక్ష)తో ఉడాయించాడు. ఆ సమయంలో వేరే కస్టమర్‌కు ఉల్లిపాయలు ఇవ్వడానికి వెళ్లినట్లు షాపు యజమాని తెలిపాడు. కస్టమర్ మాదిరిగా షాపులో అటూ ఇటూ తిరిగి.. చివరకు తాను పక్కకు వెళ్లగానే క్షణాల్లో సొత్తు మాయం చేసి పరారయ్యాడని వాపోయాడు.