Viral Video: రెచ్చిపోయిన దొంగలు.. పకడ్బందీగా డ్రెస్ కోడ్లో చోరీ - దొంగలు చోరీ చేస్తున్న దృశ్యాలు
Thieves committing theft were recorded on CCTV: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా దొంగతనాలు జరుగుతున్నా దొంగలను పట్టుకోవడంలో పోలీసు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. మంథని పట్టణంలో ఈరోజు తెల్లవారుజామున బంగారు దుకాణం, ఒక ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. పట్టణంలోని చంద్రకాంత్ గోల్డ్ వర్క్ షాప్లో ఉన్న రెండు లక్షల నగదుతో పాటు మూడు తులాల బంగారం చోరీ చేశారు. ఇదే కాకుండా పెంజేరుకట్టలోని మరో ఇంట్లో మూడు తులాల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు.
బంగారం వర్క్ షాప్లో దొంగలు చోరీకి పాల్పడిన విజువల్స్ సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దొంగలు పకడ్బందీగా వైట్ డ్రెస్ కోడ్లో చోరీ చేస్తున్న దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. గత నెలలో పట్టణంలో ఒకేరోజు నాలుగు ఇళ్లలో దొంగతనాలు జరిగాయి. ఈ సంవత్సరం జనవరి నుంచి మంథని పట్టణంలోనే దాదాపు 10 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇన్ని దొంగతనాలు జరుగుతున్నా ఇప్పటివరకు దొంగలను పట్టుకోకపోవడంపై ప్రజలు భయాందోళనలు చెందడంతో పాటు పోలీసుల నిర్లక్ష్యంపై పలు విమర్శలు వెలువెత్తాయి.