వాస్తవానికి 48 అవార్డులు తెలంగాణకే దక్కాల్సింది.. కానీ : మంత్రి ఎర్రబెల్లి - Errabelli on panchayat awards
Errabelli on panchayat awards : తెలంగాణ ప్రభుత్వ అద్భుత పనితీరుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పంచాయతీరాజ్ అవార్డులే నిదర్శనమని ఆ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వాస్తవానికి అన్ని అవార్డులూ తెలంగాణకే దక్కాల్సి ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణకు పురస్కారాలు ఇవ్వాల్సిన తప్పనిసరి పరిస్థితి కేంద్రానికి ఏర్పడిందన్న ఆయన.. న్యాయంగా రావాల్సిన నిధులు కూడా రాష్ట్రానికి ఇస్తే బాగుండేదని అన్నారు. ఉపాధి హామీ నిధులు ఆపడంతో పాటు పనిదినాల్లోనూ కోత విధించిందని ఆరోపించారు.
"జాతీయ స్థాయిలో 48 అవార్డులు ప్రకటిస్తే అందులో తెలంగాణకు 13 అవార్డులు లభించాయి. 13 అవార్డుల్లో 4 నంబర్ వన్ స్థానాల్లో గెలుచుకున్నవే. ముఖ్యమంత్రి చెప్పినట్టు మేం నడుచుకున్నాం. ఆయను చూపిన మార్గదర్శకత్వంలో పని చేశాం. ఫలితాలు సాధించాం. పంచాయతీరాజ్ శాఖ అధికారులు బాగా పనిచేశారు. పంచాయతీరాజ్ మంత్రిగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఏ అవార్డు ప్రకటించినా అందులో తెలంగాణకు ఓ పురస్కారం కచ్చితంగా ఉంటోంది. గత ఏడాది 20 అవార్డులు వస్తే 19 అవార్డులు తెలంగాణకే వచ్చాయి. మొత్తం అవార్డులు తెలంగాణకే వచ్చినప్పటికీ ప్రాంతాల వారీగా విభజించడం వల్ల వేరే రాష్ట్రాలకు కొన్ని పురస్కారాలు వెళ్తున్నాయి." అని మంత్రి ఎర్రబెల్లి ఈటీవీ భారత్ ముఖాముఖిలో మాట్లాడారు.