Sivakarthikeyan Green India Challenge : 'రాబోయే తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి' - శివకార్తికేయ లేటస్ట్ మూవీ
Tamil Hero Sivakarthikeyan Green India Challenge : భవిష్యత్ తరాల మనుగడకు అవసరమైన మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిరంతరంగా కొనసాగించాలని ప్రముఖ తమిళ నటుడు శివకార్తికేయ అన్నారు. ఎంపీ జోగినపల్లి సంతోశ్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ఆయన అభినందించారు. తన తాజా చిత్రం 'మహావీరుడు' కోసం హైదరాబాద్ వచ్చానని తెలిపారు. ఈ సందర్భంగా బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కులో మొక్కలు నాటారు. రాబోయే తరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. తన మిత్రుడు, సంగీత దర్శకుడు అనిరుద్‌కు శివకార్తీకేయ హరిత సవాల్ విసిరారు.
తమిళ ప్రేక్షకులకే కాకుండా.. తెలుగు సినిమా ప్రేక్షకులకూ శివకార్తికేయ సుపరిచితుడు. అతడు హీరోగా నటించిన ప్రిన్స్, వరుణ్ డాక్టర్, శక్తి , సీమరాజా, కౌసల్యా క్రిష్ణమూర్తి, రెమో తదితర చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. 'రెమో' సినిమాతో తెలుగు సినిమా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆయన కొత్త సినిమా మహావీరుడు ట్రైలర్ ఇప్పటికే విడుదలైంది. ఈ నెల 14న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.