Sports Policy in Telangana 2023 : తెలంగాణలో త్వరలోనే క్రీడా పాలసీ!
Sports Policy in Telangana 2023 :రాష్ట్రంలో త్వరలోనే క్రీడా పాలసీని ప్రకటిస్తామని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించి.. వారిలోని నైపుణ్యాలను వెలికి తీసేందుకు సరైన సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ప్రతి గ్రామంలో టాలెంట్ ఉన్న ఒక్కరు తమ ఆట ప్రతిభను అంతర్జాతీయ స్థాయిలో చూపించే విధంగా తయారు చేసేందుకు మరిన్ని విధానాలు రాష్ట్రంలో తీసుకువస్తారని వెల్లడించారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో.. సీఎం కప్ రాష్ట్ర స్థాయి ఆరంభ వేడుకలను మంత్రి ప్రారంభించారు. శాట్స్‌ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీలకు.. అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. రాష్ట్ర స్థాయిలో.. మొత్తం 18 క్రీడాంశాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 31 వరకు జరగనున్నాయి.
తెలంగాణ నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేయాలనే లక్ష్యంతో సీఎం కప్ ప్రారంభించామని మంత్రి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని 16,300 గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేశామని అన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయిలో రాణిస్తున్న క్రీడాకారులకు.. ప్రభుత్వం తరుఫున నగదు ప్రోత్సాహకం, ఇంటి స్థలాలు ఇచ్చామని వెల్లడించారు.