చేనులో ఛార్జింగ్ మైక్.. రైతు ఆలోచన కిర్రాక్.. - Agriculture in Telangana
crop protection with mike sound: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వన్యప్రాణులు, పక్షుల నుంచి కాపాడుకోవడానికి పలుచోట్ల రైతులు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కట్కూరులో గుగులోతు రాజు నాయక్ అనే రైతు రెండు ఎకరాల్లో పొద్దు తిరుగుడు పంటను సాగు చేశారు. ప్రస్తుతం పంట గింజ వేస్తున్న దశలో పక్షుల బెడద ఎక్కువ కావడంతో వినూత్న ఆలోచన చేశాడు. రెండు బ్యాటరీ మైక్ సెట్లను తన వాయిస్‌తో రికార్డ్ చేయించి ప్రతిరోజు పంట క్షేత్రం వద్ద పెడుతున్నాడు.
మైక్ సౌండ్‌తో పంటకు పక్షుల బెడద తప్పింది. ఈ మైక్సెట్లకు ప్రతిరోజు రాత్రి, మధ్యాహ్నం వేళల్లో ఛార్జింగ్ పెట్టి ఉదయం, సాయంత్రం పంట క్షేత్రం వద్దకు తీసుకువచ్చి పెడుతున్నట్టు రైతు తెలిపాడు. దీంతో పక్షుల బెడద తప్పిందని, మైక్ సెట్లు లేకుంటే పక్షుల బెడద భరించలేనంత ఉండి పంటను కాపాడుకోవడం కష్టమయ్యేదన్నారు. రైతు వినూత్న ఆలోచన అటువైపుగా వెళ్తున్న వారిని ఆకర్షిస్తోంది. మైక్ సౌండ్ ఏంటని పంట క్షేత్రం వద్దకు వచ్చి చూస్తూ, రైతు వినూత్న ఆలోచనను మెచ్చుకుంటున్నారు.