'రేపో, ఎల్లుండో కాంగ్రెస్ అభ్యర్థుల మూడో జాబితా నేను ఏ స్థానం నుంచి పోటీ చేయాలనేది సీఈసీ నిర్ణయిస్తుంది' - హైదరాబాద్ వార్తలు
Published : Nov 1, 2023, 11:00 PM IST
Shabbir Ali on Congress MLA Candidate 3rd List :రాష్ట్రంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో మిగిలిన స్థానాలకు రేపో, ఎల్లుండో ప్రకటించే అవకాశం ఉందని.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఏ స్థానం నుంచి పోటీ చేయాలనేది సీఈసీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు. గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఇప్పటికే రాహుల్‌గాంధీ రైతు డిక్లరేషన్, ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్స్, సోనియాగాంధీ ఆరు గ్యారంటీ స్కీంలు విడుదల చేశారని గుర్తు చేశారు.
త్వరలో మైనారిటీ, బీసీ డిక్లరేషన్లు రాహుల్, ప్రియాంక చేతుల మీదుగా విడుదల చేస్తామని ప్రకటించారు. రూ.5000 కోట్లతో మైనార్టీ సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలని సూచించాం అని తెలిపారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపు న్యాయపరంగా ముందుకు వెళ్లడమే కాకుండా 4 శాతం రిజర్వేషన్లకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ రక్షణ కల్పిస్తుందని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇవ్వగా లక్షల మంది విద్యార్థులు చదువుకున్నారని అన్నారు.