Students Sick Eating Chocolates: 30 మంది విద్యార్థులకు అస్వస్థత.. గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన చాక్లెట్లు తిని - మంత్రాలయంలో విద్యార్థులకు అస్వస్థత
School Students Sick Eating Unknown Person Giving Chocolates: గుర్తు తెలియని వ్యక్తి చేసిన పనికి కర్నూలు జిల్లాలో 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అతడు చేసిన పనికి విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులను పలకరించి మరి ఆ వ్యక్తి చాక్లెట్లు ఇచ్చినట్లు విద్యార్థులు చెప్తున్నారు.
అసలేం జరిగిందంటే: అపరిచిత వ్యక్తి ఇచ్చిన చాక్లెట్లు తిని 30 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటన కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో చోటు చేసుకుంది. మంత్రాలయంలోని స్థానిక బస్టాండ్లో సూగూరుకు చెందిన పాఠశాల విద్యార్థులు బస్సు కోసం వేచి చూస్తున్నారు. అదే సమయంలో అక్కడికి ఓ అపరిచిత వ్యక్తి వచ్చాడు. పిల్లలను పలకరించి వారికి చాక్లెట్లు ఇచ్చారు. అతడు ఇచ్చిన చాక్లెట్లను తిన్న విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వాటిని తినగానే విద్యార్థులకు కడుపునొప్పి, వాంతులు ప్రారంభమయ్యాయి. జరిగిన సంగతంతా చిన్నారులు వారి తల్లిదండ్రులకు వివరించగా.. వారు అవస్థతతో బాధపడ్తున్న విద్యార్థులను ఆసుపత్రిలో చేర్పించారు. చాక్లెట్లు ఎవరిచ్చారని అడగగా.. అతను ఎవరో తమకు తెలియదని విద్యార్థులు సమాధానమివ్వటంతో తల్లిదండ్రులు నివ్వెరపోయారు.