వాంఖడేలో 22 అడుగుల సచిన్ విగ్రహం భావోద్వేగానికి లోనైన క్రికెట్ గాడ్ - వాంఖడేలో సచిన్ విగ్రహావిష్కరణ
Published : Nov 1, 2023, 8:26 PM IST
Sachin Statue Wankhede :క్రికెట్ అభిమానుల ఆరాధ్య దైవమైన సచిన్ తెందుల్కర్ విగ్రహాన్ని ముంబయిలోని వాంఖడే స్టేడియంలో బుధవారం (నవంబర్ 1) ఆవిష్కరించారు. సచిన్ యాభై ఏళ్ల జీవితానికి నిదర్శనంగా ముంబయి క్రికెట్ అసోషియేషన్.. మైదానంలోని సచిన్ గ్యాలరీకు సమీపంలో 22 అడుగుల ఎత్తుగల విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సచిన్ తెందల్కర్ తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు. సచిన్‌తో పాటు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, బీసీసీఐ కార్యదర్శి జై షా, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్ల, ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, ఎంసీఏ అధ్యక్షుడు అమొల్ కలే విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మరోవైపు వాంఖడేలో తన విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల సచిన్ భావోద్వేగానికి గురయ్యారు. ఎంసీఏ తీసుకున్న నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని వ్యాఖ్యానించారు. వాంఖడేతో తన అనుబంధం ఇప్పటిది కాదని.. తన తొలి రంజీ మ్యాచ్‌ను ఇక్కడే ఆడానంటూ గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఆచ్రేకర్.. తనను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారిపోయానని.. ఇక్కడే తన చివరి మ్యాచ్‌ను కూడా ఆడానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. వాంఖడేకి వస్తే తన జీవిత చక్రం మొత్తం కళ్ల ముందు కనిపిస్తుందన్నారు. తన జీవితంలో అతి పెద్ద అనుభూతిగా విగ్రహావిష్కరణ నిలిచిపోతుందని తెందూల్కర్ అన్నారు. ఇలాంటి గొప్ప గౌరవం అందించిన ఎంసీఏకి 'క్రికెట్ గాడ్' ధన్యవాదాలు తెలిపారు.