RTC Bus Accident in Yadadri District : ఆటోను తప్పించబోయి ఆర్టీసీ బస్సు బోల్తా.. ప్రమాదంలో ఇద్దరు మృతి - టుడే యాదాద్రి న్యూస్
Published : Sep 20, 2023, 7:20 PM IST
RTC Bus Accident in Yadadri District :యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలం బొడ్డుగూడెం వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. తొర్రూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు.. తొర్రూరు నుంచి జగద్గిరి గుట్టకు వెళ్తున్న సమయంలో రోడ్డు నిర్మాణంలో ఉన్నందున ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి రోడ్డు పక్కకు దూసుకెళ్లి బోల్తాపడింది. ప్రమాద సమయంలో బస్సులో 33 మంది ప్రయాణిస్తుండగా.. వారిలో ఇద్దరు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని స్థానిక రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.
మృతుల్లో ఒకరు బీబీ నగర్‌కు చెందిన కొండా రాములు(43). ఇతను అడ్డగూడూర్ మండలం కొటమర్తి గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. మరొకరు చుక్కయాకమ్మ (56) అడ్డగూడూర్ మండలం చిన్న పడిశాల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే బస్సుబోల్తా పడి నిండు ప్రాణాలు బలయ్యాయని మృతుల కుటుంబ సభ్యులు రహదారిపై ఆందోళనకు దిగారు.