Revanth on second capital as Hyderabad : 'రెండో రాజధాని అంతా ఆషామాషీ కాదు.. మేధావులతో చర్చించాలి'
Revanth Reddy on Second Capital : హైదరాబాద్ దేశ రెండో రాజధానిగా ప్రతిపాదన వస్తే పార్టీలో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇది అంతా ఆషామాషీ అంశం కాదన్న రేవంత్.. హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయవనరులు రాష్ట్రానికి చెందాలా.. కేంద్రానికి చెందాలా.. అన్న అంశంపై చర్చించాల్సి ఉందన్నారు. అదే కాకుండా అధికారాల విషయంలోనూ విస్తృతంగా చర్చ జరగాల్సి ఉందన్నారు. సామాజిక, ఆర్ధిక, రాజకీయ అంశాలపై స్పష్టత కోసం సంబంధిత మేధావులతో అధ్యయనం జరగాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రెండో రాజధానిగా మారితే తెలంగాణకు ఎటుంటి ప్రయోజనాలు ఒనగూరుతాయో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. పార్టీలో చేరికలపై ఊహాగానాలు వద్దన్న రేవంత్రెడ్డి చాలా అంశాలు చర్చల దశలోనే ఉన్నాయని వివరించారు. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక తామే అధికారికంగా ప్రకటిస్తామని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలోమాదిరి.. కేసీఆర్ వ్యతిరేక పునరేకీకరణలో మీడియా కూడా భాగస్వామి కావాల్సి ఉందని రేవంత్రెడ్డి పేర్కొన్నారు.