Ramalayam in America : అమెరికాలో భద్రాద్రిని పోలిన రామాలయం - telangana latest news
Ramalayam in America : అమెరికాలో ప్రవాస భారతీయులంతా కలిసి 30 కోట్ల రూపాయల ఖర్చుతో భద్రాద్రి ఆలయాన్ని పోలిన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఆలయంలో ప్రతిష్టించనున్న విగ్రహాలకు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహాలకు జలాధివాసం పూర్థి చేసి దాన్యాధివాసం కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ ప్రతిష్టించబోయే విగ్రహాలను ఏకశిలతో ప్రత్యేకంగా తయారు చేయించారు. తయారు చేయించిన విగ్రహాలను భద్రాచలం తీసుకువచ్చి పూజలు నిర్వహించారు.
అమెరికాలోని అట్లాంటా కమింగ్ ప్రాంతంలో 2016 నుంచి ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. 2018లో అక్కడి ప్రవాస భారతీయులు 33 ఎకరాల భూమిని దేవస్థానం కోసం సేకరించారు. 2019లో భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు. యాదాద్రి వద్దగల ఆళ్లగడ్డలో అమెరికాలో నిర్మించే ఆలయానికి సంబంధించిన శిలలను చెక్కుతున్నారు. విగ్రహాలతో పాటు శిలలన్నిటిని ఓడ ద్వారా భారతదేశం నుంచి అమెరికాకి పంపించనున్నారు. 2024 శ్రీరామనవమి వరకు అమెరికాలో ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని సంకల్పంతో ఉన్నట్లు అర్చకులు పద్మనాభచార్యులు తెలిపారు.