Hyderabad Rains Today: హైదరాబాద్‌లో వర్షం.. తడిసి ముద్దయిన జనం - rain in hyderabad
Rains in Hyderabad :హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మోస్తరు వర్షానికి జనం తడిసి ముద్దయ్యారు. దీనికితోడు వరదనీరు రహదారుల పైకి రావడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కార్యాలయాల్లో విధులు ముగించుకుని ఇళ్లకు చేరుకునే ఉద్యోగులు వర్షంలో అవస్థలు పడ్డారు. దీంతో వారు దుకాణాల వద్ద, మెట్రోలైన్ కింద భాగంలో తలదాచుకున్నారు. కూకట్పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, హైదర్‌నగర్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో వర్షం కురిసింది. సూరారం, జీడిమెట్ల, బాలానగర్, సుచిత్ర, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, దుండిగల్, గండిమైసమ్మ ప్రాంతాల్లో వర్షం పడింది. చిలకలగూడ, మారేడ్‌పల్లి, ఆర్టీసీ క్రాస్‌రోడ్, బోయిన్పల్లి, ఆల్వాల్, తిరుమలగిరి, ముషీరాబాద్, చిక్కడపల్లి, విద్యానగర్, రామ్‌నగర్, మేడ్చల్, కండ్లకోయ, తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇదిలా ఉండగా.. గత కొన్ని రోజులుగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున సాయంత్రం వేళ పడిన వర్షానికి కాస్త ఉక్కపోత తగ్గింది. నగరవాసులు చల్లటి వాతావరణాన్ని ఆస్వాదించారు. వర్షంతో వేడితో పాటు ఉక్కపోత కూడా తగ్గిందని నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. జులైలో ఎక్కువగా వర్షాలు పడే అవకాశం ఉందని.. బయటకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.