మల్కాజ్‌గిరిలో రాహుల్, ప్రియాంక గాంధీ రోడ్‌షో - తరలివచ్చిన స్థానికులు - కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
Published : Nov 28, 2023, 4:45 PM IST
Rahul, Priyanka Gandhi Roadshow in Malkajgiri : తెలంగాణ ఎన్నికల పర్వం తుది అంకానికి ఇవాళ చేరుకోవడంతో ప్రధాన పార్టీల హోరు మరింత ఉద్ధృతమైంది. రాష్ట్రంలో అధికార పీఠమెక్కాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రచారాలతో ముందుకు సాగింది. శాసనసభ ఎన్నికల ప్రచారపర్వంలో ఆఖరి రోజైన ఇవాళ.. కాంగ్రెస్ అగ్రనేతలు సభలు, సమావేశాలు, రోడ్‌షోలతో తీరిక లేకుండా గడిపారు. అందులో భాగంగానే ప్రచారాలకు ముగింపు పలుకుతూ.. మల్కాజిగిరిలో కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన భారీ రోడ్డు షోలో అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాల్గొన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖ నాయకులు హాజరయ్యారు. స్థానిక కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుకు మద్దతుగా ప్రచారం సాగింది. నియోజకవర్గంలోని ఆనంద్‌బాగ్ నుంచి ప్రారంభమైన రోడ్ షోలో పెద్దఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. అశేష జనవాహిని మధ్య అట్టహాసంగా సాగిన రోడ్ షోలో మాట్లాడిన అగ్రనేత రాహుల్ గాంధీ.. బీఆర్ఎస్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఓటేస్తే మళ్లీ దొరల ప్రభుత్వం వస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే.. ప్రజా ప్రభుత్వం వస్తుందని తెలిపారు.