కాళేశ్వరంపై విచారణతో బీఆర్ఎస్ నాయకుల్లో దడ మొదలైంది : పొన్నం ప్రభాకర్ - Ponnam Comments On Vinod
Published : Jan 10, 2024, 1:05 PM IST
Ponnam Vigilance Enquiry On Kaleshwaram Project :. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణ చేపట్టడంతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో దడ మొదలైందన్నారు రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్. లక్ష కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ ప్రాజెక్టు 9 నెలలు కూడా సేవలందించ లేకపోయిందని పొన్నం విమర్శించారు. కరీంగనర్‌లో వాకర్స్‌తో పొన్నం ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. దర్యాప్తు ఇప్పుడే మొదలైందని త్వరలోనే అన్ని విషయాలు వెలుగుచూస్తాయని స్పష్టం చేశారు.
Ponnam Comments On MP Vinod Kumar :బీఆర్ఎస్ హయాంలో అడ్డగోలుగా ఉద్యోగాలు పొందిన వారి గురించి మరోసారి ప్రస్తావించారు. జెన్ కోలో అడ్డదారిలో ఉద్యోగం పొందారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజినీర్ సరితపై ఘాటుగా స్పందించారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ సరితకు ఉద్యోగం ఇప్పించిన విషయంలో ఏ మాత్రం సంబంధం లేనట్లయితే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సవాల్ విసిరారు. వినోద్ కుమార్ తనపై వచ్చిన ఆరోపణలకు స్పందించి ఫిర్యాదు చేసినట్టయితే పోలీసుల విచారణలో కూడా వాస్తవాలు వెలుగు చూస్తాయని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చిత్తశుద్దిని కూడా నిరూపించుకునట్టు అవుతుందన్నారు. జెన్కోతో పాటు ఇతర ప్రభత్వ విభాగాల్లో అక్రమంగా ఉద్యోగం పొందిన వారు వెంటనే వారంతా తమ ఉద్యోగాలు వదులు కోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు