తెలంగాణ

telangana

By

Published : Jan 24, 2023, 6:03 PM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

ETV Bharat / videos

అక్కడ మళ్లీ మొదలైన రాజకీయ నేతల పసుపు రాజకీయం

నిజామాబాద్ జిల్లాలో పసుపు రాజకీయం మొదలైంది. పసుపు బోర్డు హామీ ఏమైందని అధికార బీఆర్ఎస్ ప్రశ్నిస్తుంటే.. పసుపు పంటకు ధర కోసం కేంద్రానికి లేఖ ఎందుకు రాయడం లేదని ప్రతిపక్ష బీజేపీ నిలదిస్తోంది. పసుపు పంటకు ధర విషయంలో మూడేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. నిజామాబాద్ మార్కెట్‌కు పసుపు రాక మొదలు కావడంతో ధర విషయంలో పార్టీల రాజకీయం మొదలైంది. రాష్ట్రంలో అతి వర్షాలు తదితర కారణాల వల్ల గత రెండేళ్ల కంటే ఈసారి పసుపు రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. నష్టం కూడా ఎక్కువగా ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని పసుపు రైతులను ఆదుకునే విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాల్సింది పోయి ఆరోపణలతో రాజకీయం చేస్తున్నాయి. 

రాష్ట్రంలో పసుపు పంటకు ఏకైక మార్కెట్​గా నిజామాబాద్ మార్కెట్ యార్డు నిలుస్తోంది. ఈ ఏడాది పసుపు సీజన్ ఆరంభం కావడంతో చేతికొచ్చిన కొద్ది పంటను ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు రైతులు పసుపు పంట తీసుకొస్తున్నారు. ఏటా పసుపు పంట చుట్టూ సాగే రాజకీయం తాజాగా మరోసారి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. అధికార, ప్రతిపక్ష పార్టీలు మద్దతు ధర విషయంలో ప్రతి సంవత్సరం తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసుకుంటాయి. సీజన్ ప్రారంభంలోనే అధిక ధరలు ఉండాల్సింది గతం కంటే చాలా తక్కువగా ఉన్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు రైతులను ఆదుకోవాల్సింది పోయి కేవలం రాజకీయం కోసం ఆరోపణలు, ప్రతిఆరోపణలు చేసుకుంటున్నాయి తప్ప తమ కోసం చేస్తుంది ఏమీ లేదని రైతులు వాపోతున్నారు. పసుపు ధర పెరుగుదల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

...view details