Kalti Ice Cream in Hyd: సమ్మర్లో ఐస్‌క్రీం తింటున్నారా.. కాస్త జాగ్రత్త సుమీ
Kalti Ice Cream in Hyderabad : హైదరాబాద్‌లో కల్తీరాయుళ్ల ఆగడాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చిన్నపిల్లలు తినే చాక్లెట్లు పెద్దఎత్తున కల్తీ చేస్తున్న ఘటన మరవకముందే నగరశివారులో ఐస్‌క్రీమ్ కల్తీ దందా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌లోని ఐస్‌క్రీం తయారు కేంద్రంపై శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు నిర్వహించిన దాడుల్లో నకిలీ ఐస్‌క్రీం కుప్పలు, ముడిసరుకు బయటపడింది. ధనార్జనే ధ్యేయంగా ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరును చూసి పోలీసులే ఆశ్చర్యానికి గురయ్యారు.
ఎలాంటి అనుమతులు లేకుండా నాణ్యత ప్రమాణాలను గాలికొదిలేసి ఇష్టారీతిన తయారు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నకిలీ ఐస్ క్రీమ్స్ తయారు చేసి వాటిని ప్రముఖ బ్రాండ్ల పేరుతో మార్కెట్‌లోకి పంపుతున్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు. పరిశ్రమలో అపరిశుభ్రమైన పరిస్థితులు, బోరు నీళ్లతో కనీస ప్రమాణాలు పాటించటంలేదని మండిపడ్డారు. పైగా ఆకర్షణీమైన స్టిక్కర్లను అంటించి, గ్రామీణ ప్రాంతాలకు వీటిని తరలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ దాడుల్లో వారి వద్ద నుంచి కల్తీ ఐస్‌క్రీమ్‌లు, వాటిని రవాణా చేసే వాహనాలు, ముడిసరకును స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.