నిండు ప్రాణాన్ని బలిగొన్న నిర్లక్ష్యం.. రోడ్లపై ఇలాంటోళ్లుంటారు జాగ్రత్త..!! - రెండు బైకులు ఢీకొని వ్యక్తి మృతి
వాహనదారుడి నిర్లక్ష్యం.. ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్ మండలం జూలపల్లి వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. చందనాపూర్కు చెందిన శ్రీనివాస్ యాదవ్ ద్విచక్రవాహనంపై రొంపికుంటకు వెళ్తుండగా జూలపల్లి రహదారి వద్ద చొప్పరి శ్రీనివాస్ అనే వ్యక్తి అకస్మాత్తుగా బైక్‌తో రహదారిపైకి వచ్చాడు. దీంతో శ్రీనివాస్ బైక్ అదుపుతప్పి ఎదురుగా వచ్చిన బండిని ఢీకొట్టింది. కిందపడిన శ్రీనివాస్ యాదవ్ తలకు బలమైన గాయమైంది. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న ఓ సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి.
క్షతగాత్రుడిని గోదావరిఖని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. చొప్పరి శ్రీనివాస్ కాస్త చూసుకుని బండి నడిపినా.. శ్రీనివాస్ యాదవ్ తలకు హెల్మెట్ పెట్టుకున్నా ఇంత ఘోరం జరిగి ఉండకపోయేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. యువకుడి మృతితో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు శిరస్త్రానం ధరిస్తే.. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలతో బయటపడొచ్చని పోలీసులు తెలిపారు.