Devotees Rush in Bhadradri: : భద్రాద్రిలో భక్తుల రద్దీ.. ప్రసాదం కోసం పాట్లు!
Devotees Rush in Bhadradri: హనుమాన్ జయంతి సందర్భంగా భద్రాద్రి రామయ్య సన్నిధిలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి హనుమాన్ దీక్షాపరులు భారీ సంఖ్యలో స్వామివారి దర్శనానికి చేరుకున్నారు. దీంతో ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ క్రమంలోనే స్వామివారిని దర్శించుకున్న భక్తులు.. తరువాత ప్రసాదం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లడ్డూ ప్రసాద విక్రయ కేంద్రాల దగ్గర రెండు, మూడు గంటలు వేచి చూడాల్సి వస్తోంది. ఈ కౌంటర్లు తక్కువగా ఉండటంతో క్యూలైన్ల వద్ద వేచి చూడాల్సి వస్తుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భక్తులు అధిక సంఖ్యలో కౌంటర్ల వద్ద వేచి ఉన్నప్పటికీ ప్రసాదం అందించకపోవడంతో.. క్యూలైన్ల వద్ద ఉన్న రాడ్ల పైకి ఎక్కి ప్రసాదం తీసుకునేందుకు పోటీపడ్డారు. లడ్డూ ప్రసాదాల కౌంటర్ల వద్ద తొక్కిసిలాట జరుగుతున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఏమాత్రం అదుపు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా ప్రధాన ఆలయంలోని సీతారాములకు ఉపాలయంలోని శ్రీ ఆంజనేయ స్వామి వారికి విశేష అభిషేకం నిర్వహించారు. సాయంత్రం తిరువీధి సేవ నిర్వహించనున్నారు.