New Police Stations In Hyderabad : 35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణ
New Police Stations In Hyderabad : 35 ఏళ్ల తర్వాత హైదరాబాద్ కమిషనరేట్ పునర్వవస్థీకరణ జరిగిందని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైన జూన్ 2 నుంచి కొత్త పీఎస్లన్నీ పూర్తి స్థాయిలో పని చేస్తాయని తెలిపారు. రాబోయే 15 ఏళ్ల జనాభా, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకొని పునర్ వ్యవస్థీకరణ చేసినట్లుగా కమిషనర్ వెల్లడించారు. కొత్త పీఎస్‌ల కోసం కొన్ని భవనాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని.. మరికొన్ని సిద్దం అవుతున్నాయని తెలిపారు. ప్రజలు, సమస్యల వారీగా పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేస్తున్నామని సీవీ ఆనంద్ వివరించారు.
35 సంవత్సరాల తర్వాత హైదరాబాద్ సిటీ పోలీస్, పునర్విభజన జీవో ఎంఎస్ 32 ప్రకారం పోలీస్ స్టేషన్ల విభజన జరగబోతుందని సీవీ ఆనంద్ తెలిపారు. ప్రతి జోన్లో మహిళల భద్రతకై ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ అని ఒక కొత్త పోస్టును చేశామని.. వీరి ఆధ్వర్యంలో ఇవన్నీ ఉంటాయని చెప్పుకొచ్చారు.
రాబోయే 15 ఏళ్లను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ కమిషనరేట్‌ను పునర్ వ్యవస్థీకరించినట్లు సీపీ వెల్లడించారు. హైదరాబాద్ కమిషనరేట్ 1987లో ఏర్పాటు చేసినప్పుడు 25 లక్షల జనాభా మాత్రమే ఉండేదని.. ప్రస్తుతం 80 లక్షలకు పైగా చేరుకుందని తెలిపారు. మూడు కమిషనరేట్ల పరిధిలో కలిపి 1.6 కోట్ల జనాభా ఉందని.. రోజూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే వారి సంఖ్య దీనికి అదనమని వివరించారు. ప్రభుత్వం శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని, కమిషనరేట్‌లో కొత్త జోన్లు, డివిజన్లు, పోలీస్ స్టేషన్ల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగానే అంగీకరించారని సీవీ ఆనంద్ తెలిపారు.
కమిషనరేట్ పునర్ వ్యవస్థీకరణ కోసం నగరంలో దాదాపు 30 ఏళ్ల నుంచి పని చేస్తున్న సీనియర్ పోలీస్ అధికారులతో కమిటీ వేసి ఆర్నెళ్ల పాటు పలు అంశాలను పరిశీలించిన తర్వాత నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. పోలీస్ స్టేషన్ల సరిహద్దు వివాదాలు లేకుండా.. కొత్త పీఎస్‌ల ఏర్పాటు జరిగిందని.. అధిక పని భారం ఉన్న పోలీస్ స్టేషన్లకు అదనంగా కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు సీవీ ఆనంద్ వెల్లడించారు. రూ.33 కోట్ల అంచనాతో కొత్త పోలీస్ స్టేషన్ల ఏర్పాటు, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు. వచ్చే జూన్ 2వ తేదీ నాటికి కొత్తగా ఏర్పాటైన పోలీస్ స్టేషన్లు పూర్తిస్థాయిలో పని చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకొని కొత్త ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లూ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.