నేపాల్ విమానం క్రాష్.. ఫేస్బుక్లో లైవ్ ఇచ్చిన భారత ప్రయాణికుడు - నేపాల్ ప్లేన్ ప్రమాదం
నేపాల్ విమాన ప్రమాదానికి సంబంధించి మరో వీడియో బయటకు వచ్చింది. ప్రమాదానికి ముందు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫేస్బుక్ లైవ్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గాజియాబాద్‌కు చెందిన నలుగురు వ్యక్తులు ఈ విమానంలో ప్రయాణించారని అధికారులు తెలిపారు. వీరంతా ఘటనలో ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. మృతుల బంధువులతో టచ్‌లో ఉన్నట్లు వెల్లడించారు. మృతదేహాలను భారత్‌కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు స్పష్టం చేశారు. మృతుల్లో సోనూ జైశ్వాల్, అభిషేక్ కుష్వాహా, అనిల్ కుమార్ రాజ్‌భర్, విశాల్ శర్మ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరంతా గాజీపుర్‌లోని కాసిమాబాద్కు చెందినవారని చెప్పారు. అయితే, ప్రమాదానికి ముందు సోనూ జైశ్వాల్ విమానంలో నుంచి ఫేస్బుక్ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాడు. విమానం బయటి దృశ్యాలు, లోపల ఉన్న ప్రయాణికులు వీడియోలో కనిపిస్తున్నారు. ఒక్కసారిగా విమానం కుప్పకూలడం, ప్రయాణికుల ఆర్తనాదాలు, భారీగా మంటలు చెలరేగడం అందులో రికార్డైంది. జనవరి 13న వీరంతా నేపాల్ టూర్‌కు వెళ్లారని స్థానికులు తెలిపారు.