లారీలో వచ్చి ఏటీఎంను ఎత్తుకెళ్లిన దొంగలు.. మెషీన్ బద్దలు కాలేదని..
Nashik ATM Stolen : ఆర్పీఎఫ్ జవాన్ల ట్రైనింగ్ క్యాంపు సమీపంలోని ఏటీఎం మెషీన్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. ఏటీఎం బద్దలు కాకపోవడం వల్ల ఏకంగా మెషిన్‌ను ట్రక్కులో ఎక్కించి పరారయ్యారు. ఈ ఘటన మహారాష్ట్ర నాశిక్‌లో జరిగింది.
దొంగతనం జరిగింది ఇలా..
ఆదివారం తెల్లవారుజామున.. సమన్‌గావ్ ప్రాంతంలోని ఆర్పీఎఫ్ ట్రైనింగ్ క్యాంపు సమీపంలో ఉన్న ఏటీఎంలో చోరీకి నలుగురు దొంగలు వచ్చారు. ఏటీఎంను పగులగొట్టేందుకు విఫలయత్నం చేసిన దొంగలు.. ఏకంగా మెషీన్నే ట్రక్కులో ఎక్కించి అక్కడనుంచి పరారయ్యారు. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో అదీ పోలీస్ ట్రైనింగ్ సమీపంలో దొంగతనం జరగడం గమనార్హం. దొంగతనం దృశ్యాలన్నీ సీసీటీవీలో రికార్డు అయ్యాయి. క్రైమ్ డిపార్ట్మెంట్ సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని.. సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కాగా దొంగలు మెషీన్‌ను ఎత్తుకెళ్లే సమయానికి ఏటీఎంలో ఎంత నగదు ఉందో అన్నదానిపై స్పష్టత రాలేదు.
సమన్‌గావ్ క్యాంపునకు దేశ నలుమూలల నుంచి.. ఆర్పీఎఫ్ జవాన్లు, అధికారులు శిక్షణ కోసం వస్తారు. అయితే ఈ ప్రాంతం పట్టణానికి దూరంగా ఉండడం వల్ల.. జవాన్లు నగదు ఉపసంహరించుకోవడానికి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వారి సౌకర్యం కోసం అధికారులు స్థానికంగా ఏటీఎంను ఏర్పాటు చేయించారు. ప్రస్తుతం అదే ఏటీఎం చోరీకి గురైంది.