కేటీఆర్ వయసుకు మించి మాట్లాడుతున్నారు - బీఆర్ఎస్, బీజేపీ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ : మైనంపల్లి - కేటీఆర్‌పై మైనంపల్లి వ్యాఖ్యలు
Published : Nov 24, 2023, 6:30 PM IST
Mynampally Fires on Minister KTR : మల్కాజిగిరి నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్ షోలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తీవ్రస్థాయిలో స్పందించారు. కేటీఆర్ వయస్సుకు మించి మాట్లాడుతున్నారని.. ఇక్కడ మోదీపై విమర్శలు చేసి.. దిల్లీకి వెళ్లి ఆయన కాళ్లు పట్టుకుంటారని విమర్శించారు. బీఆర్ఎస్, బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమ అమరవీరుల త్యాగం ఫలితంగా రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు.
కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి ఫామ్‌హౌస్ వెళ్లడానికి సంవత్సరానికి రూ.80 కోట్లు ఖర్చు పెడుతున్నారని మైనంపల్లి ఆరోపించారు. మల్కాజిగిరికి ఎన్నిసార్లు వచ్చారంటూ కేటీఆర్‌ను.. ఒకప్పుడు హరీశ్‌రావు ట్రంక్ డబ్బా పట్టుకుని రబ్బరు చెప్పులు ధరించి.. రాజకీయాల్లోకి వచ్చాక ఎన్ని కోట్లు సంపాదించారో చెప్పాలని ప్రశ్నించారు. తన మీద ఐటీ దాడులు చేయమని చెప్పింది ఎవరంటూ మండిపడ్డారు. తాను మెదక్‌లో పేద ప్రజలకు ఇళ్లు, స్కూలు కట్టించి సామాజిక సేవ చేస్తున్నానని తెలిపారు. దళిత, లంబాడీల భూములు లాక్కున్న చరిత్ర మీదంటూ కేసీఆర్, కేటీఆర్‌ను దుయ్యబట్టారు. పేపర్ లీకేజీ చేయడం.. కోట్ల డబ్బులు తీసుకొని మంత్రి పదవులు ఇచ్చే సంస్కృతి బీఆర్ఎస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు.