MP Komatireddy Counter to KCR : '50 ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో కేసీఆర్‌కు తెలియదా?' - KCR latest news
Published : Aug 22, 2023, 7:41 PM IST
MP Komatireddy Counter to KCR Statements :సూర్యాపేట సభలో ముఖ్యమంత్రి కేసీఆర్.. కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలతోపాటు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (MPKomatiReddy Venkatr Reddy)స్పందించారు. తమ పార్టీ హయాంలోనే.. నాగార్జునసాగర్ ప్రాజెక్టును నిర్మించారనే విషయం సీఎం కేసీఆర్‌కు తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. గత 50 సంవత్సరాలలో కాంగ్రెస్ ఏం చేసిందో.. తెలియదా అని ప్రశ్నించారు.
శ్రీశైలం, కల్వకుర్తి, శ్రీరాంసాగర్ కట్టింది కాంగ్రెస్ హయాంలోనే అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గుర్తు చేశారు. తొమ్మిదేళ్లలో ప్రభుత్వం ఏం చేసిందో ఆలోచించుకోవాలని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లోకి తీసుకెళ్లిన కేసీఆర్‌కు (CM KCR).. తమ పార్టీని విమర్శించే హక్కు లేదని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ సర్కార్ ఓట్ల కోసం ప్రజలను మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి ప్రకటించిన 115 మంది అభ్యర్థుల ఆస్తులు.. ఎమ్మెల్యేలు కాకముందు ఎంత.. అయ్యాక ఎంత పెరిగిందనే వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని కార్యకర్తలు, నిరుద్యోగులకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు.