Mother and daughter suicide : మంజీర నదిలో దూకి తల్లికూతుళ్ల ఆత్మహత్య - Telangana latest news
Suicide in Manjira river Naganpally : చిన్న చిన్న కలహాలు పచ్చని కుటుంబాల మధ్య చిచ్చుపెడుతున్నాయి. అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలు జీవితాలకు శాపాలుగా మారుతున్నాయి. పరిష్కారం అయ్యే సమస్యలను భూతద్దంలో పెట్టి చూసి మరణాలకు స్వాగతం పలుకుతున్నారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన పిల్లలనూ.. భార్యభర్తల గొడవలతో చేజేతులా హతమార్చుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండలం నాగన్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో వివాహిత విజయ.. తన నాలుగేళ్ల కూతురు గౌరితో కలసి మంజీర నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.
గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటున్న విజయ పుట్టింట్లో ఉంటోంది. కుటుంబ సభ్యులతో కలహాల కారణంగా ఆదివారం కూతురు గౌరిని తీసుకుని వెళ్లి పోయింది. ఈరోజు ఉదయం మంజీర నదిలో మృతదేహాలు తెలియడంతో మత్స్యకారులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన రాయికోడ్ పోలీసులు నదిలోంచి మృతదేహాలను వెలికి తీశారు. శవ పరీక్షల నిమిత్తం మృతదేహాలను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.