MLA Rajasingh Latest Speech : 'వచ్చే శాసనసభలో నేను ఉండకపోవచ్చు..' ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు - Telangana Assembly interesting news
MLA Rajasingh Speech at Assembly : బీజేపీ బహిష్కృత నేత.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను వచ్చే శాసనసభలో ఉండకపోవచ్చంటూ పేర్కొన్నారు. ఇంటా-బయటా తాను అసెంబ్లీకి రాకూడదని కోరుకుంటున్నారని తెలిపారు. ధూల్‌పేట్ అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కట్టుబడి ఉంటానని చెప్పి మాట తప్పారని ఆరోపించారు. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ సమావేశాలకు తాను ఉన్నా లేకున్నా.. ధూల్‌పేట్‌ను అభివృద్ధి చేయాలంటూ స్పీకర్‌ను కోరారు.
గతేడాది వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై బీజేపీ పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని బీజేపీ క్రమశిక్షణ సంఘం భావించింది. గతేడాది ఆగస్టు 23న ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. పార్టీ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆయనపై చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. శాసనసభాపక్ష పదవి నుంచి కూడా తొలగించింది. అనంతరం అప్పటి నుంచి ఆయనను పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెడుతూ వస్తున్నారు.