బండి సంజయ్‌ను పరామర్శించేందుకు వెళ్లిన రఘునందన్.. అరెస్టు - MLA Raghunandan rao arrest
MLA Raghunandan rao arrest : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను అరెస్టు చేసి అనంతరం భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ తరుణంలో ఆయన్ను పరామర్శించేందుకు వెళ్లిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యేకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట జరిగింది. ఈ క్రమంలో పోలీసులు రఘునందన్‌ను వాహనంలోకి ఎక్కించే ప్రయత్నం చేయగా.. వారితో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగగా.. ఆయన్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసుల వాహనాన్ని బీజేపీ మహిళా కార్యకర్తలు అడ్డుకున్నారు.
బండి సంజయ్‌ను ఎందుకు అరెస్ట్ చేశారని.. ఏ కేసులో అరెస్టు చేశారో చెప్పడం లేదని రఘునందన్ రావు మండిపడ్డారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను పోలీసులు పాటించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం అమలు చేయడం లేదని విమర్శించారు. ఒక ఎమ్మెల్యే అని చూడకుండా తనను రెండు కిలోమీటర్ల దూరంలో తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. అక్కడి నుంచి కాలి నడకన స్టేషన్ వద్దకు చేరుకున్నాని చెప్పారు.