విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే సహించం: శ్రీనివాస్‌గౌడ్
Minister Srinivas Goud comments on bandi sanjay: బీజేపీ కార్యకర్తే పదోతరగతి ప్రశ్నాపత్రాలు బైటకు పొక్కేలా చేసి, బైటకొచ్చిన ప్రశ్నాపత్రాన్ని ఆ పార్టీ అధ్యక్షుడికి పంపాడని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఆ తర్వాత ఆ పేపర్‌ను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తూ విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడటం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించారు. జగ్జీవన్‌రాం జయంతి సందర్భంగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి పేపర్ లీకేజీ వ్యవహారంపై స్పందించారు.
రాజకీయ అవసరాల కోసం పేపర్ లీకేజీలు చేయడం హేయమైన చర్య అంటూ శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. లీకేజీ అయిందని భావిస్తే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలే.. తప్ప సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం ఏంటని ఎదురుదాడికి దిగారు. తెలంగాణలో పోలీసు వ్యవస్థ పకడ్బందీగా ఉందని, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు బీజేపీ చర్యలను అర్థం చేసుకుంటున్నారని అన్నారు. అధికారంలోకి రావాలంటే గుడి, బడి, విద్యార్ధులు, నిరుద్యోగులను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయొద్దని హితవు పలికారు. ఇంతటి దిగజారుడు రాజకీయాలు ఎక్కడా చూడలేదని అసహనం వ్యక్తం చేశారు.